కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ‘గ్రీన్ గ్రోత్ ఎకానమిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్’ (Economic Summit)రెండు రోజుల సదస్సు ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘ది మెరీడియన్ కలెక్టివ్’ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ సమ్మిట్‌కు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు తరలివచ్చారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు (AI) రంగంలో తెలంగాణ కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకోలేదని, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం, స్థానిక ఉపాధిని కలగలిపి ప్రపంచానికి సరికొత్త దిక్సూచిని చూపిస్తోందని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన ఏఐ సాంకేతికతకు హైదరాబాద్‌ను కేరాఫ్ అడ్రస్‌గా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన ప్రకటించారు.
ఏఐ వెనుక క్లౌడ్ కంప్యూటింగ్, సర్వర్లతో పాటు విద్యుత్, నీరు, భూమి, మానవ వనరుల వంటి ఎన్నో కీలక అంశాలు ముడిపడి ఉన్నాయని ప్రభుత్వం గుర్తించిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తాము సాంకేతికతకు వ్యతిరేకం కాదని, అయితే ఆ ఏఐ వ్యవస్థలు ఏ విధంగా ఉండాలో ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్నామని చెప్పారు. పర్యావరణానికి హాని కలిగించే ఏఐ సంస్థలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించబోదని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులు తప్పనిసరిగా స్వచ్ఛమైన ఇంధనం, రీసైకిల్ చేసిన నీటిని మాత్రమే వినియోగించుకోవాలని, అలాగే స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలనే నిబంధనలను విధించినట్లు వెల్లడించారు. ఇది కేవలం సాంకేతిక మెరుగుదల మాత్రమే కాదని, పర్యావరణం పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతకు, విలువలకు నిదర్శనమని అభివర్ణించారు.
ప్రపంచవ్యాప్తంగా కార్బన్ క్రెడిట్స్ గురించి చర్చ జరుగుతున్న తరుణంలో, తెలంగాణ ప్రభుత్వం ‘పీపుల్స్ క్రెడిట్’ అనే వినూత్న భావనను తెరపైకి తెచ్చిందని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏఐ పెట్టుబడులు కేవలం డేటా సెంటర్ల ఏర్పాటుకే పరిమితం కాకుండా, గ్రామీణ యువతకు నైపుణ్యాలు పెంపొందించడానికి, సామాజిక వృద్ధికి ఉపయోగపడాలని స్పష్టం చేశారు. వ్యవసాయానికి, సామాన్య ప్రజల అవసరాలకు ఉపయోగపడే నీటి వనరులతో సాంకేతికత ఎన్నడూ పోటీ పడకూడదని ఆయన చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం భాషా అడ్డంకులు లేకుండా సామాన్యులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి సులువుగా అందుబాటులో ఉండాలన్నారు.
ప్రజల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, పారదర్శక పాలన, పెట్టుబడులకు అనుకూల వాతావరణం అనే నాలుగు సూత్రాల పునాదిపై తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని భట్టి విక్రమార్క వివరించారు. భవిష్యత్తులో కేవలం కృత్రిమ మేధస్సు మాత్రమే కాకుండా, మానవీయ విలువలు కలిగిన సాంకేతిక వ్యవస్థలే ప్రపంచాన్ని నడిపిస్తాయని, ఆ దిశగా తెలంగాణ ఇప్పటికే అడుగులు వేసిందని చెప్పారు. డేటా సెంటర్ల నిర్మాణంలోనే కాకుండా, బాధ్యతాయుతమైన ఏఐని ఎలా నిర్మించాలో ప్రపంచానికి నేర్పే రోల్ మోడల్‌గా తెలంగాణ నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

