‘జాంబి రెడ్డి 2’లో పాటను వెంటనే తొలగించాలి: తేలు విజయ

కలం, ​కరీంనగర్: తన అనుమతి లేకుండా తానే స్వయంగా రచించి, పాడి రూపొందించిన ‘పున్నమ్మ పున్నమ్మ (Punnama Punnama Song)’ పాటను ‘జాంబి రెడ్డి 2’ సినిమాలో ఉపయోగించారని తెలంగాణ ఉద్యమ గాయకురాలు తేలు విజయ (Telu Vijaya) కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సిఐని కలిసి ఆదివారం ఫిర్యాదు చేశారు. ​ఈ సందర్భంగా తేలు విజయ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ పండుగకు సంబంధించిన ఎన్నో పాటలను తాను స్వయంగా రచించి, పాడి ప్రజల్లోకి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఎంతో కష్టపడి రూపొందించుకున్నా..

ఉద్యమ సమయం నుండి ఇప్పటి వరకు బతుకమ్మ పండుగ వచ్చిందంటే తెలంగాణ ఆడపడుచుల కోసం అనేక పాటలను రూపొందిస్తున్నానని పేర్కొన్నారు. ఎంతో కష్టపడి రూపొందించుకున్న ‘పున్నమ్మ పున్నమ్మ’ పాటను తమ అనుమతి లేకుండా ‘జాంబి రెడ్డి 2’ సినిమాలో ఉపయోగించడం వల్ల తమ హక్కులకు, మనోభావాలకు భంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అనుమతి లేకుండా పాటను సినిమాలో ఉపయోగించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఆ పాటను సినిమా నుండి వెంటనే తొలగించాలని పోలీస్ స్టేషన్ ఆఫీసర్ కి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

దొంగతనంగా వాడుకోవడం సరికాదు..

తేలు విజయకు మద్దతుగా తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వేదికల మీద తన గొంతు ద్వారా ఉద్యమానికి ఊపిరి పోసిన గాయకురాలు తేలు విజయక్క పాటను దొంగతనంగా వాడుకోవడం సరికాదన్నారు. తెలంగాణ ప్రాంత కళాకారుల పట్ల ఇప్పటికీ ఆంధ్ర పెత్తనం సాగుతుందనడానికి ఈ సంఘటనే నిదర్శనమని మండిపడ్డారు. ​

బాధ్యత ప్రభుత్వంపై ఉంది..

అనంతరం తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ లింగంపల్లి నాగరాజు మాట్లాడుతూ.. రచయితలు, కళాకారుల సృజనాత్మక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అనుమతి లేకుండా కళాకారుల సృష్టిని ఉపయోగించే ఇలాంటి ఘటనలపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ​ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, కుతాడి శ్రీనివాస్, శ్రీరాముల రమేష్, గాలిపల్లి రత్నాకర్ చారి, గర్షకుర్తి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>