కలం, వరంగల్ బ్యూరో: రాఖీ పండుగ అంటే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. కానీ వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో మరో అర్థం వినిపిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి కొండా సురేఖ (Konda Surekha) శుక్రవారం రాఖీ కట్టడం రాజకీయ వర్గాల్లో ‘రాజీ సంకేతం’గా మారింది.
కొద్దిరోజులుగా కొండా కుటుంబం చుట్టూ రాజకీయాలు తిరుగుతుండగా.. సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలతో రేగిన దుమారం, అధిష్ఠానం ఆగ్రహం, మంత్రిపై వేటు అంటూ సాగిన ప్రచారాల మధ్యన రాఖీ సెంటిమెంట్ చోటుచేసుకోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే సుస్మిత వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో కొండా సురేఖ వివరణ ఇచ్చారు. ఆమె వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చారు.
అయినప్పటికీ కొండా కుటుంబంపై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగానే ఉంది. మంత్రి పదవిపై కూడా అనిశ్చితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్‌రెడ్డికి సురేఖ రాఖీ కట్టడం మరింత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆత్మీయ కలయిక మాత్రమేనా? లేక ఇటీవలి పరిణామాలకు ముగింపు పలికేందుకా..? లేదంటే సీఎంతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే రాజకీయ ప్రయత్నమా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
ఒక రాఖీ.. ఎన్నో సంకేతాలు
సీఎంకు రాఖీ కట్టడం ద్వారా ‘తనకు, సీఎంకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు’ అనే సందేశాన్ని సురేఖ పంపించారా? అనేది హాట్‌టాపిక్‌గా మారింది. మరోవైపు పార్టీ అధిష్టానం చర్యలకు సిద్ధమవుతుందనే ప్రచారంలో ఉండగా ఇలాంటి సమయంలోనే చోటుచేసుకోవడంతో.. వివాదానికి తెరదించేందుకు ఇరువర్గాల మధ్య సయోధ్య ప్రక్రియ మొదలైందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఒక్క ఫొటో కూడా ఒక్కోసారి వెయ్యి మాటలు చెబుతుంది. ఇప్పుడు సీఎంకి సురేఖ రాఖీ కట్టిన సందర్భం కూడా అలాంటి రాజకీయ సంకేతంగానే కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
తూర్పులో మారనున్న సమీకరణాలా?
ఈ పరిణామంతో కొండా సురేఖ (Konda Surekha)కు రాజకీయంగా పట్టున్న వరంగల్ తూర్పులో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల పరిణామాలతో పార్టీలో వర్గాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు తాజా పరిణామం కొంత ఊరట కలిగించిందనే చర్చ మొదలైంది. ఇక అంతా సద్దుమణిగినట్టేనా? సురేఖకు అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిందా? సీఎంతో సయోధ్య కుదిరినట్టేనా? అనే ప్రశ్నలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవల వరంగల్ కాంగ్రెస్‌లో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే, రాఖీ పండుగ రోజున సీఎం, మంత్రి మధ్య ఆత్మీయతను సాధారణ పరిణామంగా చూడలేమనే అభిప్రాయం కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది. అయితే ఇది నిజంగా రాజకీయ రాజీకి సంకేతమా? లేక పండుగ సందర్భంగా జరిగే సహజమైన ఆత్మీయతేనా? అనేది స్పష్టంగా తెలియాలంటే మరికొద్ది రోజుల్లో కొండా సురేఖ వ్యవహరించే తీరు కీలకం కానుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఇలాంటి ప్రశ్నలే చర్చనీయాంశంగా మారాయి.

