కరీంనగర్ పొలిటికల్ హీట్.. ‘సుడా’ పీఠం దక్కేదెవరికి ?

కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి సుడా (శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) చైర్మన్ (Karimnagar SUDA Chairman) నియామకంపైనే ఉంది. గత నెల 8న చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పదవీకాలం ముగిసింది. ప్రస్తుతం పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ సీనియర్, ద్వితీయ శ్రేణి నేతలు ముమ్మర ప్రయత్నాలే చేస్తున్నారు. గతంలో శాతవాహన వర్సిటీ పరిధి వరకే పరిమితమైన సుడా ఇప్పుడు జిల్లావ్యాప్తంగా సేవలు విస్తరిం చడంతో చైర్మన్ పదవికి ప్రాధాన్యత పెరిగింది. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టుల జాబితాలో సుడా చైర్మన్ నియామకం కూడా కీలకంగా మారింది.

రేసులో పలువురు నేతలు

గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడి, పార్టీ ఆదేశాలతో త్యాగం చేసినందుకు నరేందర్‌రెడ్డి చైర్మన్ అయ్యారు. తన పదవిని మరోసారి పునరుద్ధరించుకునేందుకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అండదండలతో ప్రయత్నిస్తున్నారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, ఎమ్మెల్సీ అభ్యర్థి వూటుకూరి నరేందర్‌రెడ్డి కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఆకారపు భాస్కర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

తొలిసారి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడంతో, ఈసారి బీసీ వర్గానికి కేటాయించాలని సీనియర్ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ పట్టుబడుతున్నారు. కోహెడ ఎంపీపీగా సేవలందించిన రాచకొండ చక్రధర్ రావు కూడా మంత్రి పొన్నం మద్దతుతో రేసులో ఉన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్, ఎమ్మెల్యేగా పోటీ చేసిన పులిమల్ల శ్రీనివాస్ కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు.

మంత్రుల నిర్ణయం మేరకే

జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమన్వయంతోనే తుది నిర్ణయం జరగనుంది. పార్టీ కోసం కష్టపడిన పాత కార్యకర్తలకే నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తామని అధిష్టానం స్పష్టత ఇవ్వడంతో కొత్త ఆశలను రేపుతోంది. సుడా చైర్మన్ పదవి నామినేటెడ్ పోస్ట్ మాత్రమే కాదు.

కరీంనగర్ సిటీ అభివృద్ధి, మాస్టర్ ప్లాన్, నిధుల వినియోగంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవలి కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్వల్ప తేడాతో మేయర్ పీఠాన్ని కోల్పోగా.. బీజేపీ దక్కించుంది. మళ్లీ వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీకి పునర్వైభవం తేవాలన్నా, ప్రత్యర్థులను ఎదుర్కొవాలన్నా ప్రజాదరణ కలిగిన నేతకే చైర్మన్ పీఠం అప్పగించాలనే చర్చ కేడర్ లో జరుగుతోంది.

మరోవైపు నామినేటెడ్ పోస్టుల్లో 70 శాతం పదవులు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకే ఇస్తామని పీసీసీ చీఫ్ స్పష్టత ఇవ్వడంతో కొత్త ఆశలు చిగురించాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉన్నందున బీసీ లేదా మైనార్టీకి అవకాశం దక్కవచ్చనే ప్రచారం సాగుతోంది. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ అవసరాలను సమన్వయం చేసుకుంటూ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాల్సిందే!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>