కలం, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో జరగబోయే కీలకమైన మూడు టెస్టుల సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. తాజా సమాచారం ప్రకారం, ఆ జట్టు ప్రిమియర్ ఫాస్ట్ బౌలర్ కాగిసో రబడా (Kagiso Rabada) తీవ్రమైన గాయం కారణంగా ఈ టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. వింటర్ కండిషనింగ్ శిక్షణలో పాల్గొన్న సమయంలో రబడా కుడి తొడ కండరంలో తీవ్రమైన గ్రేడ్-3 గాయం అయింది. వైద్యుల అంచనా ప్రకారం అతడు కోలుకోవడానికి దాదాపు 10 వారాల సమయం పడుతుంది. అక్టోబర్ 9న డర్బన్‌లో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సమయానికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది.
సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్, లయన్స్ బౌలింగ్ కోచ్ ఆలాన్ డోనాల్డ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. రబడా ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమవుతాడని ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్ తర్వాత, అక్టోబర్ 9 నుంచి టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. రబడా దూరం కావడం సౌతాఫ్రికా బౌలింగ్ దళానికి పెద్ద లోటే. అతడి స్థానంలో గెరాల్డ్ కోయెట్జీ, కార్బిన్ బాష్, యువ బౌలర్ క్వేనా మఫాకా ఎక్కువ బాధ్యత తీసుకోనున్నారు.
వీపు గాయం నుంచి కోలుకుంటున్న ఎన్‌డ్రే బర్గర్ ఫిట్‌నెస్‌ను కూడా టీమ్ మేనేజ్‌మెంట్ నిశితంగా పరిశీలిస్తోంది. అతడు టెస్ట్ సిరీస్ నాటికి కోలుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. 73 టెస్టుల్లో 340 వికెట్లు తీసిన రబడా, ఆస్ట్రేలియాపై అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నాడు. 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా విజయం సాధించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు.

