కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర రాజకీయాల్లో గత వారం రోజులుగా జరుగుతున్న మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఎపిసోడ్ రక్షాబంధన్ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డికి ఆమె రాఖీ కట్టడంతో సరికొత్త టర్న్ తీసుకుందనే చర్చలు మొదలయ్యాయి. క్రమశిక్షణ కమిటీ నివేదిక ఎలా ఉన్నా సురేఖపై చర్యలు తీసుకునే అంశంలో ఏఐసీసీ నేతల ఆలోచన భిన్నంగా ఉన్నదనే సంకేతాలు అందుతున్నాయి.
ముఖ్యమంత్రి టైమ్ ఇచ్చినా ఇవ్వకున్నా రాఖీ కట్టి తీరుతానని మంత్రి కొండా సురేఖ తన సన్నిహితులతో ధీమాను వ్యక్తం చేశారు. దానికి తగినట్లుగానే ఆమె సీఎం నివాసానికి వెళ్లడం, రాఖీ కట్టడం, పలకరించడం.. ఒకదాని వెంట ఒకటిగా కంప్లీట్ అయ్యాయి. రాష్ట్రంలోని ఆడపడుచులందరిపై సీఎం రేవంత్‌రెడ్డి ఆశీర్వాదాలు ఉండాలని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. “ఆ ఆడపడుచుల్లో నేను కూడా ఉన్నా. ముఖ్యమంత్రికి కూడా మహిళల అండ ఎప్పుడూ ఉంటుంది” అని మీడియాకు మంత్రి సురేఖ వివరించారు.
కొంతకాలం స్టేటస్ కో!
కూతురు సుష్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో మంత్రివర్గం నుంచి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనే ఊహాగానాలు వెలువడిన సమయంలో సీఎం రేవంత్రెడ్డికి సురేఖ రాఖీ కట్టడం విశేషం. ప్రతీ సంవత్సరం రాఖీ కట్టడం ఆనవాయితీ. కానీ, ఈసారి మాత్రం సుష్మిత వివాదం నేపథ్యంలో కొండా సురేఖ కట్టిన రాఖీకి ప్రాధాన్యం ఏర్పడింది.
సీఎం టైమ్ ఇవ్వకపోవచ్చనే వార్తలు వెలువడినా ఇంటికి వెళ్లి కడతానంటూ సురేఖ (Konda Surekha) తన సన్నిహితులతో ముందుగానే చెప్పారు. ఈ సెంటిమెంట్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందనే చర్చ జరుగుతుండగానే కొంత కాలం వరకు ఆమెపై ఎలాంటి చర్యలు ఉండకపోవచ్చనే అభిప్రాయమూ వినిపిస్తున్నది.
ఎలాగూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆగస్టు 31న విదేశీ పర్యటన ముగించుకుని వస్తున్నారని, ఆ తర్వాతనే తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించి ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని, అది కూడా వెంటనే ఉండకపోవచ్చని, కాస్త టైమ్ ఇచ్చి రాజకీయ వాతావరణం చల్లబడేలా చూస్తుందనే సంకేతాలూ వెలువడ్డాయి. దీంతో అప్పటివరకు కొండా సురేఖ యథావిధిగా మంత్రిగానే కొనసాగనున్నారు.
క్రమశిక్షణ కమిటీ, ఏఐసీసీ ఆలోచనల్లో తేడాలు
ముఖ్యమంత్రిపైనే చాలా పరుషమైన పదాలతో సుష్మిత వివాదాస్పద కామెంట్లు చేయడంతో ఆమె తల్లిగా మంత్రి కొండా సురేఖకు పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సుష్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని కొండా సురేఖ రిప్లై ఇచ్చారు. సుష్మిత వ్యాఖ్యలతో రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రకంపనలు నెలకొన్నాయి.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుస ప్రెస్‌మీట్లు పెట్టి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలని, పార్టీ క్రమశిక్షణ చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి కౌంటర్‌గా సురేఖ సైతం జడ్జిమెంట్ ఇచ్చే తీరులో, ప్రభావితం చేసేలా ఈ ప్రెస్‌మీట్ స్టేట్‌మెంట్లు ఉంటున్నాయని, ఇది అవాంఛనీయ పరిణామమని రెండో లెటర్‌లో పేర్కొన్నారు. ఇదే క్రమంలో పీసీసీకి, ఏఐసీసీకి క్రమశిక్షణ కమిటీ ఆరు పేజీల నివేదిక అందజేసింది.
మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం మొదలు గతంలో కొండా సురేఖ వివాదాస్పద కామెంట్లు, వాటితో పార్టీపై పడిన ప్రభావాన్ని అందులో ప్రస్తావించింది. ఆమెపై చర్యలు తీసుకుంటే పార్టీపై పడే దుష్ప్రభావం, త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో చోటుచేసుకునే పరిణామాలు, బీసీ సంఘాల నుంచి ఎదురయ్యే ఒత్తిడి.. వీటన్నింటినీ బేరీజు వేసుకుని చూసేలా ఏఐసీసీ ఆలోచిస్తున్నది. సెప్టెంబర్ 7న అసెంబ్లీ సెషన్ ప్రారంభం కాబోతున్నందున మంత్రి హోదాలోనే సురేఖ పాల్గొంటారనే పాజిటివ్ సంకేతాలు రాష్ట్ర కాంగ్రెస్‌లో వినిపిస్తున్నాయి.

