epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

విజన్ సరే… ఇంప్లిమెంటేషన్ ఎలా?

కలం డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ (Telangana Economy) 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకునేలా ప్రభుత్వం ఇటీవలే విజన్ డాక్యుమెంట్ లో పేర్కొన్నది. క్యూర్, ప్యూర్, రేర్ (CURE, PURE, RARE) అనే మూడు రీజియన్‌లుగా ఈ లక్ష్యాన్ని సాధిస్తామని పేర్కొన్నది. ఏయే రంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందాలో కూడా పేర్కొన్నది. రాష్ట్ర ఆర్థిక శాఖ పరిధిలో ప్లానింగ్ డిపార్టుమెంటు ఉన్నప్పటికీ ఐఎస్‌బీ (ISB) కు విజన్ డాక్యుమెంట్ (Telangana Vision Document) తయారీ బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. దేశ, విదేశీ ఇన్వెస్టర్లు, ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తల సమక్షంలో విజన్ డాక్యుమెంట్‌ను ప్రభుత్వం ఆవిష్కరించినా ఈ లక్ష్యం చేరుకోడానికి అవసరమైన రోడ్ మ్యాప్ (Road Map) ఇప్పుడు కీలకంగా మారింది.

ఇంప్లిమెంటేషన్ డాక్యుమెంట్ ఎప్పుడు? :

విజన్ డాక్యుమెంట్‌కు (Telangana Vision Document) అనుగుణంగా ఆచరణీయ మార్గాన్ని సూచించే ఓ డాక్యుమెంట్ కూడా ఐఎస్‌బీ రూపొందించాల్సి ఉన్నది. రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు సగానికి పైగా ఉద్యోగుల వేతనాలు, సంక్షేమ పథకాల అమలు, పాత అప్పుల వడ్డీలు తీర్చడానికే ఖర్చవుతున్న నేపథ్యంలో పరిమితి నిధులతో మౌలిక సదుపాయాలను పెంచడం, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ప్రభుత్వానికి కత్తిమీద సామే. పన్నులు పెంచితే ఓటు బ్యాంకు దెబ్బతింటుందనే ఆందోళన, ఆర్థిక వనరులను మొబిలైజ్ చేసుకోడానికి ఎక్కువ మార్గాలు లేకపోవడం.. ఇవన్నీ ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే ఐఎస్‌బీ ఇంప్లిమెంటేషన్ డాక్యుమెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం తగిన పాలసీలను రూపొందించుకోవడం కష్టమనే అభిప్రాయాన్ని సచివాలయ వర్గాలు వ్యక్తం చేశాయి.

ఐఏఎస్ అధికారుల్లోనే సందేహాలు :

విజన్ డాక్యుమెంట్‌ను చూసి పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూ (MoU)లు కుదుర్చుకున్నాయి. కానీ ఇందులో ఎన్ని గ్రౌండింగ్ అవుతాయనే అంశంలో భిన్నాభిప్రాయాలు ఐఏఎస్ అధికారుల్లో వ్యక్తమవుతున్నాయి. వివిధ రాష్ట్రాల అనుభవాలు, తెలంగాణ పుష్కర కాలంలో కుదుర్చుకున్న ఒప్పందాలు, వాటి ద్వారా వస్తాయనుకున్న పెట్టుబడులు.. వీటన్నింటినీ బ్యూరోక్రాట్లు గుర్తుచేస్తున్నారు. విజన్ డాక్యుమెంట్‌ను ఐఏఎస్ అధికారులు సైతం తయారు చేయగలరని, కానీ ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ఎంచుకునే మార్గాలు రాజకీయ పార్టీల ఆలోచనకు అనుగుణంగా ఉండాలని గుర్తుచేశారు. ఐఎస్‌బీ రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ కంటే అది ఇవ్వాల్సిన ఇంప్లిమెంటేషన్ డాక్యుమెంట్ చాలా కీలకమన్నారు. ఎంఓయూలు కుదుర్చుకున్న పలు కంపెనీలు ఈ ఇంప్లిమెంటేషన్ డాక్యుమెంట్‌ను స్టడీ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాయని ఉదహరించారు.

Read Also: లెక్కల పాఠం చెప్పిన ‘బండి’

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>