కలం, తెలంగాణ బ్యూరో : మధ్యప్రదేశ్‌లో జరిగిన బోట్ ప్రమాదంతో తెలంగాణ (Telangana) టూరిజం శాఖ అప్రమత్తమైంది. ఆ రాష్ట్రంలోని బార్గి రిజర్వాయర్ దగ్గర ఇటీవల జరిగిన క్రూయిజ్ ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బోటింగ్ భద్రతలపై కఠిన చర్యలు చేపట్టింది. పర్యాటకుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బోటింగ్ యూనిట్లకు పటిష్టమైన మార్గదర్శకాలను (Boating Safety Rules) జారీ చేసింది. యూనిట్ మేనేజర్లు, ఇన్‌చార్జ్‌లే భద్రతా ప్రమాణాల అమలుకు బాధ్యులంటూ మే 1న విడుదల చేసిన సర్క్యులర్‌లో ఆ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. డ్యూటీ టైమ్‌లో, ముఖ్యంగా వీకెండ్, సెలవు రోజులు, పీక్ సీజన్ రోజుల్లో అధికారులు యూనిట్ల దగ్గర తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బోటింగ్ సేవలను నిలిపివేయాలని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడొద్దని, అలర్టుగా ఉండాలని స్పష్టం చేశారు.
సందర్శకులకు లైఫ్ జాకెట్లు తప్పనిసరి
బోట్‌లో ప్రయాణించే ప్రతీ ఒక్కరికి లైఫ్ జాకెట్‌ను తప్పనిసరిగా ఇవ్వాలని ఆ సర్క్యులర్‌లో ఉన్నతాధికారులు నొక్కిచెప్పారు. బోట్‌లలో ఓవర్‌లోడింగ్‌పై పూర్తిగా నిషేధం విధించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే ఇన్‌చార్జీలే బాధ్యులవుతారని, వారిపై శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలూ తప్పవని హెచ్చరించారు. అవసరమైతే సస్పెన్షన్ వేటు వేయక తప్పదన్నారు. భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేసేలా ప్రతీ బోటింగ్ యూనిట్‌లో రోజువారీ తనిఖీలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫస్ట్ ఎయిడ్ కిట్, రెస్క్యూ పరికరాలు, స్పష్టమైన ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలన్నారు. ప్రతీ యూనిట్‌లో కనీసం ఒక సిబ్బంది బేసిక్ లైఫ్ సపోర్ట్, వాటర్ రెస్క్యూ పద్ధతుల్లో శిక్షణ పొందినవారై ఉండాలని సూచించారు. పర్యాటకుల రద్దీని నియంత్రించేందుకు జెట్టి ప్రాంతాల్లో క్యూలైన్ వ్యవస్థను అమలు చేయాలని, అధిక రద్దీ ఉన్న రోజుల్లో సిబ్బందికి సెలవులను తగ్గించాలని సూచించారు. ప్రయాణికుల భద్రతే ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఈ మార్గదర్శకాలను అన్ని యూనిట్లూ కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.

