కలం, ఖమ్మం బ్యూరో: గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వశాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. అటవీ, రెవెన్యూ భూ సమస్యల పరిష్కారం కూడా ప్రణాళికలు రచించాలన్నారు. బుధవారం కలెక్టర్ భద్రాచలం, పినపాక నియోజకవర్గాల పరిధిలో నెలకొన్న అటవీ, రెవెన్యూ భూ సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించి ఐటీడీఏ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణ గౌడ్, ఐటీడీఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ప్రతి శాఖాధికారి తమ పరిధిలోని సమస్యలను ప్రతి నెల సమీక్షిస్తూ పరిష్కరించాలన్నారు. గిరిజన ప్రాంతాలలో రహదారులు, విద్యుత్, తాగునీరు వంటి పనుల్లో ఆలస్యం జరగకుండా చూడాలన్నారు.
భూ సమస్యలు పరిష్కరించండి
మండల సమాఖ్య, అంగన్‌వాడీ భవనాలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సంబంధించిన భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. అర్హులైన గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు, డీఎల్సీ అనుమతులు లభించేలా చూడాలని పేర్కొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మాట్లాడుతూ చర్ల, దుమ్ముగూడెం మండలాలలో రహదారులు, విద్యుత్, తాగునీరు తదితర అభివృద్ధి పనుల అనుమతులు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని అధికారుల దృష్టికి తెచ్చారు. అనంతరం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఐటీడీఏ పరిధిలో రూ. 28.39 కోట్లు, పంచాయతీరాజ్ శాఖలో రూ. 6.50 కోట్లు, ఆర్ అండ్ బి శాఖ పరిధిలో సుమారు రూ. 67 కోట్ల అభివృద్ధి పనులు కేవలం అటవీ అనుమతుల కోసమే పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.
జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ స్పందిస్తూ, జిల్లాలో 58 శాతం అటవీ ప్రాంతం ఉన్నందున ప్రతి అభివృద్ధి పనికి అటవీ శాఖ అనుమతులు తప్పనిసరని పేర్కొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ మాట్లాడుతూ, పదేళ్లకు పైగా సాగు చేస్తున్న అర్హులైన గిరిజనులకే పోడు పట్టాలు అందేలా ప్రాధాన్యత ఇవ్వాలని, పోడు రైతులకు సంబంధించి ఇప్పటివరకు 1,076 దరఖాస్తులను అటవీ శాఖకు పంపగా 254 మందికి అనుమతులు లభించాయని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఆర్ఓ పద్మావతితో పాటు ఇంజనీరింగ్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, అటవీ, ఐటీడీఏ శాఖల అధికారులు పాల్గొన్నారు.

