Defection Case | ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మరోసారి విచారణ ప్రక్రియను ప్రారంభించారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే తొలి దశలో నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన నేపథ్యంలో, రెండో దశ విచారణలు ప్రారంభం కానున్నాయి. స్పీకర్ ఆదేశాల మేరకు గురువారం ఇద్దరు ఎమ్మెల్యేల కేసులు విచారణకు వస్తున్నాయి. ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావ్ వర్సెస్ వివేకానంద కేసు విచారణ జరగనుంది ప్రారంభమైంది. ఈ కేసులో వివేకానంద గౌడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పీకర్ పరిశీలన జరుపుతారు. విచారణ సమయంలో తెల్లం వెంకట్రావు తరఫు న్యాయవాదులు, వివేకానంద గౌడ్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.
తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వర్సెస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కేసు విచారణ ఉంటుంది. సంజయ్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సంజయ్ తరఫు అడ్వకేట్లు జగదీశ్ రెడ్డిని క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. శుక్రవారం మరో రెండు ఫిరాయింపు కేసులు విచారణకు రానున్నాయి. ఉదయం 11 గంటలకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి వర్సెస్ జగదీశ్ రెడ్డి కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో పోచారం తరఫు న్యాయవాదులు జగదీశ్ రెడ్డిని ప్రశ్నించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వర్సెస్ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణ జరుగుతుంది. ఈ కేసులో గాంధీ తరఫు న్యాయవాదులు సంజయ్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇప్పటికే ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి విచారణ ప్రారంభించారు. మొదటి విడతలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి కేసులు పూర్తయ్యాయి. ఇప్పుడు రెండో విడత విచారణల్లో తెల్లం వెంకట్రావు, సంజయ్‌కుమార్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికపూడి గాంధీల కేసులు చర్చకు రానున్నాయి.
స్పీకర్ ఈ నెల 12, 13 తేదీలలో కూడా మరిన్ని ఫిరాయింపు కేసుల(Defection Case) విచారణ చేపట్టనున్నారు. విచారణల నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మీడియా ప్రవేశానికి కూడా పరిమితులు విధించారు.
ఇంకా రెండు ముఖ్యమైన కేసులపై స్పష్టత రాలేదు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై బీఆర్‌ఎస్ పార్టీ చేసిన ఫిర్యాదులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వీరికి నోటీసులు జారీ అయ్యాయా? వారు సమాధానాలు ఇచ్చారా? అనే విషయమై అసెంబ్లీ కార్యాలయం ఇంకా అధికారిక సమాచారం విడుదల చేయలేదు. ఇదిలా ఉంటే, దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరూ స్వచ్ఛందంగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
Read Also: మీడియాపై అడవిశేషు రుసరుస.. ఆ పదంపై అభ్యంతరం
Follow Us on: Youtube

