ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో మావోయిస్టు ఎన్‌కౌంటర్ల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఓ వైపు లొంగుబాట్లు, మరోవైపు ఎన్ కౌంటర్లతో మావోయిస్టుల ప్రాబల్యం గణనీయంగా తగ్గుతున్నది. ఆపరేషన్ కగార్(Operation Kagar) పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే లొంగుబాట్లు, కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా బీజాపూర్ జిల్లా తార్లగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో భద్రతబలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు అధికారులు ధృవీకరించారు.
మద్దేడు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు అన్నారం, మరికెళ్ల అడవుల్లో తలదాచుకున్నారని భద్రతా బలగాలకు కచ్చితమైన సమాచారం అందింది. దీంతో డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. సుమారు గంటపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు అక్కడికక్కడే హతమయ్యారని పోలీసులు తెలిపారు.
మృతుల దగ్గర నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటికీ అడవిలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. బుధవారం కూడా ఇదే ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ సంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అంటే రెండు రోజుల్లో ఏడుగురు మావోయిస్టులు భద్రతా బలగాల చేతిలో హతమయ్యారు. ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో మావోయిస్టు కదలికలు పెరగడంతో భద్రతా దళాలు ఆపరేషన్లను మరింత ఉధృతం చేశాయి.
Read Also: ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ప్రారంభం
Follow Us on: Instagram

