కడియం, దానం లకు క్లీన్ చిట్

కలం, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి (Kadiyam Srihari), దానం నాగేందర్ (Danam Nagender) లపై డిస్ క్వాలిఫికేషన్ వేటు వేయడానికి అసెంబ్లీ స్పీకర్ నిరాకరించారు. ఇప్పటికీ వారు బీఆర్ఎస్ తోనే కొనసాగుతున్నారని స్పష్టం చేశారు. ఆ పార్టీ నుంచి మారారనడానికి, ఫిరాయించారనడానికి (Defection Case) ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదులు, పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తోసిపుచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారని, వారిని డిస్ క్వాలిఫై చేయాలని దాఖలైన పిటిషన్లను స్పీకర్ సుదీర్ఘంగా విచారించి తుది తీర్పును బుధవారం ప్రకటించారు. వీరిద్దరిపై తీర్పును వెల్లడించడంతో మొత్తం పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. వారంతా ఇప్పటికీ బీఆర్ఎస్ తో కొనసాగుతున్నట్లయింది.

బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారంటూ గులాబీ ఎమ్మెల్యేలు పలువురు అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. స్పందించడంలేదన్న అసంతృప్తితో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పలుమార్లు విచారించిన సుప్రీంకోర్టు.. నిర్దిష్ట గడువులో వారిపై అనర్హత వేటు వేయడంపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసినవారిని, వారి తరఫు న్యాయవాదులను, ఫిరాయింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను, వారి తరఫున న్యాయవాదులను ముఖాముఖి విచారించారు. ఇరుపక్షాల తరఫున వాదనలను తీసుకున్న తర్వాత సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఇచ్చిన వాంగ్మూలాల మేరకు స్పీకర్ వారిపై అనర్హత వేటు వేసే విషయంలో స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

కడియంపై వచ్చిన ఆరోపణలేంటి :

స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ-ఫామ్ మీద పోటీ చేసి గెలిచారని, ఆ తర్వాత ఆరు నెలలకు వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుండగా ఆమె నామినేషన్ పత్రాల్లో ప్రొపోజర్ గా సంతకాలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార రధాన్ని ఎక్కి కుమార్తె తరఫున ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ ను కలిసినప్పుడు ఆ పార్టీ కండువా కప్పుకున్నారని స్పీకర్ కు చేసిన ఫిర్యాదులో గులాబీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయించినందుకు డిస్ క్వాలిఫై చేయాలని కోరారు.

దానం నాగేందర్ పైనా అంతే.. :

ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ-ఫామ్ మీద పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బీ-ఫామ్ మీద సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని గులాబీ ఎమ్మెల్యేలు ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారనడానికి ఇంతకంటే నిదర్శనమేంటని ప్రస్తావించారు. పలు సందర్భాల్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని, ఆ పార్టీ నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశాల్లో పాల్గొన్నారని రాతపూర్వకంగా తెలిపారు. ఈ ఆరోపణలపై సుదీర్ఘంగా విచారణ జరిపి ఫిరాయించారనడానికి (Defection Case) తగిన ఆధారాలు లేవని భావించిన స్పీకర్ ఆయనపై అనర్హత వేటు వేయడానికి నిరాకరించారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్నది వీరే :

    పేరు                     నియోజకవర్గం

కడియం శ్రీహరి –           స్టేషన్ ఘన్ పూర్
దానం నాగేందర్ –          ఖైరతాబాద్
తెల్లం వెంకటరావు –        భద్రాచలం
కాలె యాదయ్య –           చేవెళ్ళ
పోచారం శ్రీనివాసరెడ్డి –    బాన్సువాడ
డాక్టర్ సంజయ్ –           జగిత్యాల
గూడెం మహిపాల్ రెడ్డి –   పటాన్ చెరు
ప్రకాశ్ గౌడ్ –                 రాజేంద్రనగర్
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి – గద్వాల
అరికెపూడి గాంధీ –         శేరిలింగంపల్లి

Read Also: ‘గ్రేహౌండ్స్’కు ఆల్టర్నేట్ టాస్క్!.. డ్రగ్స్, ఈగల్ ఫోర్స్ బాధ్యతలు?..

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>