కలం, వరంగల్ బ్యూరో: రైతులకు నమ్మకమైన, అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డి (Sunketa Anvesh Reddy) అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, ఏఆర్‌ఎస్‌కే (ARSK) కేంద్రాల ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు కల్తీ విత్తనాల బారినపడి నష్టపోతున్న ఈ పరిస్థితుల్లో, రైతులను నాణ్యమైన విత్తనాల వినియోగం దిశగా నడిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. ఈ రెండు జిల్లాలో ప్రధానంగా సాగు చేస్తున్న పంట వరి అని, రైతులకు ఆదాయం పెరగాలంటే వరి నుండి ఇతర పంటల ( పెసర, కంది, మినుము, శనగ, వేరుశనగ, నువ్వులు) సాగు వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నేరుగా రైతులతో అనుసంధానమై, వారి ద్వారానే విత్తన ఉత్పత్తి చేపడుతుందని చైర్మన్ తెలిపారు. సేకరించిన విత్తనాలను కఠినమైన ప్రమాణ పరీక్షల అనంతరం ధృవీకరించి మాత్రమే రైతులకు అందజేస్తున్నామని అన్నారు. దీని వల్ల రైతులకు నాణ్యతపై పూర్తి భరోసా ఉంటుందని వివరించారు.
వానకాలం సీజన్‌కు విత్తనాలు సిద్ధం
ప్రస్తుత వానకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించి జిల్లాలో విత్తనాల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. సన్న రకాలలైన బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, కెఎన్‌ఎం 1638. దొడ్డు రకాలైన కెఎన్‌ఎం 118, ఎమ్‌టియు 1010. విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రభుత్వం సూచించిన రకాలను మాత్రమే డీలర్లు విక్రయించాలని ఆదేశించారు. పచ్చిరొట్ట విత్తనాలు జీలుగ, జనుము విత్తనాలను కూడా సకాలంలో రైతులకు అందిస్తున్నామని తెలియజేశారు.
ఈ సీజన్ లో 2.68 లక్షల ఎకరాల్లో వరి సాగు
ఈ వానకాలం సీజన్‌లో సుమారు 2.68 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అందుకు 66 వేల క్వింటాళ్ల విత్తనం అవసరమని తెలిపారు. ఇందులో కనీసం 30 వేల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం ద్వారా సరఫరా చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే నూతన విత్తన చట్టం ద్వారా రైతుల హక్కులతో పాటు, డీలర్ల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం కాపాడుతుందని అన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారులు (DAO), ఏడీఏలు, ఎంఏఓలు, సహకార శాఖ అధికారులు (DCO), విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు, విత్తన డీలర్లు, ఎఫ్‌పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.

