Mobile Popup Ad
Mobile Popup Ad

హనుమకొండ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు

కలం, వరంగల్ బ్యూరో: ఇటీవల ప్రకటించిన హనుమకొండ జిల్లా కాంగ్రెస్ (Hanumakonda Congress) కమిటీ పార్టీలో అసమ్మతి సెగలు రాజేసింది. మొదటి నుంచి పార్టీ జెండా మోసిన నాయకులను కాదని కొత్తగా వచ్చిన వారికి కీలక భాద్యతలు ఏ విధంగా అప్పగిస్తారని అసమ్మతి నేతలు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లా అధ్యక్షుడు మాత్రం స్థానిక ఎమ్మెల్యే సూచించిన జాబితా మేరకు కమిటీని ప్రకటించినట్లు చెబుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. మరి కొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా జిల్లా ప్రెసిడెంట్ అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

సీనియర్లకు మొండిచేయి

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత జిల్లా కమిటీ (District Committee)లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో 20-30 ఏళ్లుగా పార్టీ జెండా మోసిన సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసీలు, మండల అధ్యక్షులు జిల్లా కమిటీలో చోటు ఆశించారు. కానీ కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి, ఎమ్మెల్యే అనుచరులకు కమిటీలో ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేగాకుండా సామాజిక అంశాలను పక్కనబెట్టి బీసీ, ఎస్సీ, మైనార్టీ కోటాలో పాత కార్యకర్తలను కాదని, డబ్బులు ఖర్చు పెట్టిన వారికి పదవులు ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకే కుటుంబం నుంచి రెండు, మూడు పదవులు కూడా కట్టబెట్టినట్లు ప్రచారంలో ఉంది. దీంతో మిగతా సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

జిల్లా అధ్యక్షుడి ఏకపక్షం

జిల్లా కమిటీ ఎంపికలో అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే సలహాతోనే లిస్ట్ ఫైనల్ చేశారనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే వర్గాన్ని పక్కన పెట్టి వారి అనుచరులకు కీలక పదవులు కట్టబెట్టార‌నే టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. గత ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన నేత అనుచరులకు చోటు దక్కలేదని, ఎన్ఎస్‌యూఐ , యూత్ కాంగ్రెస్‌లో పదేళ్లకు పైగా పని చేసిన వారికి కనీసం ఉపాధ్యక్ష, కార్యదర్శి పదవులు రాలేదని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
.
మున్సిపల్ ఎన్నికల వేళ కొత్త లొల్లి..!

మరి కొద్ది రోజుల్లో వరంగల్ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. గత పదేళ్లుగా అధికారానికి దూరంగా నేతలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ పరిధిలోని మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు వారి వారసులను రంగంలోకి దింపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో జిల్లా కమిటీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన ఇంట్లో మంత్రి, ఎమ్మెల్యేలతో విందు పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ సందర్బంగా వారి వారి మనసులోని మాటలు బయటపెట్టుకున్నట్లు తెలిసింది. ఎవరికి టికెట్ వచ్చినా అందరు కలిసి కట్టుగా పని చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నాయిని తన కూతురు లేదా అల్లుడిని మున్సిపల్ బరిలో నిలిపి మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో జిల్లా కమిటీలో తన వర్గీయులకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ సీనియర్ నేతలు పదవులు దక్కని కారణంగా అసమ్మతి రాగం అందుకోవడం పార్టీలో గందరగోళాని దారి తీసింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతోందనని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.

గాంధీభవన్‌కు ఫిర్యాదు..?

జిల్లా కమిటీలో చోటు దక్కని, అప్రాధాన్యత పదవులు పొందిన నేతలు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అపాయింట్‌మెంట్ కోసం ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఏ ఒక్కరి అపాయింట్‌మెంట్‌ దొరికినా వారిని కలిసి సదరు నేతలకు జరిగిన అన్యాయాన్ని వెళ్ల‌బోసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>