కొత్త వాహనాల కొనుగోలుపై భారీ రాయితీలు : మంత్రి పొన్నం

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహన స్క్రాపేజీ పాలసీ (Vehicle Scrappage Policy) సత్ఫలితాలను ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)​ అన్నారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. 2024 సెప్టెంబరు నుండి ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలువుతోందని వెల్లడించారు. గడిచిన పదేళ్లలో గత ప్రభుత్వం విస్మరించిన ఈ కీలక పాలసీని ప్రస్తుత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, తద్వారా రవాణా శాఖలో మార్పులకు శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు, సిద్దిపేట జిల్లా వర్గల్, సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో మూడు అధునాతన వెహికిల్ స్క్రాపింగ్ కేంద్రాలు (RVSF) అందుబాటులో ఉన్నాయని, 2025 నుండి ఇవి పూర్తిస్థాయిలో సేవలందిస్తున్నాయని మంత్రి వివరించారు.

పాత వాహనాలను వదిలి కొత్త వాహనాలు కొనేవారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీగా రాయితీలు ప్రకటిస్తోంది. పాత వాహనాలపై ఉన్న పన్ను బకాయిలను రద్దు చేయడంతో పాటు, కొత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు మోటార్ సైకిళ్లకు 5 వేల వరకు, కార్లకు 50 వేల వరకు పన్ను మినహాయింపు ఇస్తోంది. అదేవిధంగా రవాణా వాహనాలకు ఏకంగా 19 శాతం పన్ను రాయితీ కల్పిస్తోంది. ప్రభుత్వ విభాగాల్లో ఇప్పటికే 15 ఏళ్లు దాటిన 4285 వాహనాలను తప్పనిసరిగా స్క్రాప్ చేయించగా, సుమారు 2 వేల ప్రైవేటు వాహనాలు కూడా ఈ విధానంలో స్క్రాప్‌కు వెళ్లాయి. మొత్తంగా ఇప్పటివరకు 6278 వాహనాలు స్క్రాప్ చేయబడ్డాయని మంత్రి గణాంకాలను వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 48.98 లక్షల పాత వాహనాలు ఉండగా, ఒక్క హైదరాబాద్‌లోనే 16 లక్షల వాహనాలు 15 ఏళ్ల వయసు దాటినవి ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. అయితే ప్రైవేటు వాహనదారులకు ఇది తప్పనిసరి కాదని, వాహనం మంచి కండిషన్‌లో ఉన్నంత వరకు రిజిస్ట్రేషన్ పునరుద్ధరించుకోవచ్చని ఆయన స్పష్టత ఇచ్చారు. కానీ విద్యార్థుల భద్రత దృష్ట్యా 15 ఏళ్లు దాటిన స్కూల్ బస్సులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని తేల్చి చెప్పారు. టీజీఆర్టీసీలో కూడా పాత బస్సుల స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నామని తెలిపారు.

మరోవైపు గ్రీన్ టాక్స్ వసూళ్ల ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం వస్తోంది. 2024-25లో 68.11 కోట్లు వసూలు కాగా, 2025-26లో దాదాపు 2 లక్షల వాహనాల నుండి 71.14 కోట్ల రూపాయల గ్రీన్ టాక్స్ వసూలైంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఈవీ వాహనాలు కొనేందుకు వీలుగా వాహన తయారీ సంస్థలు 15 నుండి 20 శాతం డిస్కౌంట్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయని మంత్రి తెలిపారు. అంతేకాకుండా ప్రజా ప్రతినిధులు సైతం ఈవీ వాహనాలు కొనుగోలు చేసేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెల్లడించారు.

Read Also: లిక్క‌ర్ వినియోగం ఒక్క శాతం కూడా పెర‌గ‌లేదు: మంత్రి జూప‌ల్లి

Follow Us On : WhatsApp

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>