కలం, వెబ్ డెస్క్: దశాబ్దాలుగా పేదల కోసం రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు అద్భుత సేవలు (RDT Services) అందిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. విదేశీ నిధుల సమస్య పరిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని వేల గ్రామాల్లో ఆర్డీటీ వివిధ రకాల సేవలందిస్తోందని కొనియాడారు. గతంలో నిధుల నిలిపివేతతో సంస్థ సేవలకు అంతరాయం కలిగిందని.. కేంద్ర హోంమంత్రి చొరవతో ఇవాళ అడ్డంకులన్నీ తొలగిపోయాయన్నారు. నిధుల సేకరణకు ఆర్డీటీని కేంద్రం అనుమతించడంతో మార్గం సుగమమైందని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంత్రి లోకేష్ (Nara Lokesh) శుభవార్త చెప్పారు. ఆర్డీటీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇది లక్షలమంది సంతోషించే సమాచారమని చెప్పారు. ఆర్డీటీ సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని కేంద్రం మాట ఇచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడంతో అడ్డంకులు తొలగిపోయాయన్నారు. ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్య సేవలందించే సంస్థ కృషిని కేంద్రానికి వివరించానని చెప్పారు. ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అటు అనంతపురం ఆర్డీటీకి కేంద్ర హోంశాఖ లైన్‍క్లియర్ చేయడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ఎఫ్‍సీఆర్‍ఏ అనుమతులు మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి వల్లే ఆర్డీటీ సేవలు (RDT Services) కొనసాగుతున్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్‌కు రుణపడి ఉంటామని స్పష్టం చేశారు.
Read Also: సీఎం పబ్లిసిటీతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు: గుడివాడ అమర్‌నాథ్
Follow Us On: X(Twitter)

