epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సర్పంచ్ అభ్యర్థులకు అప్పు పుడ్తలేదా?

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి పేరు సైదులు (పేరు మార్చాం). అతడికి ఊళ్లో మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. సమీపంలోని పట్టణంలో ఓ నాలుగైదు ప్లాట్లు ఉన్నాయి. కానీ సర్పంచ్ ఎన్నికల్లో (sarpanch elections) అనూహ్యంగా పోటీ చేయడంతో చేతిలో లిక్విడ్ క్యాష్ లేదు. ఎన్నికల ఖర్చు కోసం రూ.20 లక్షల వరకు కావాల్సి వచ్చింది. అప్పు కోసం తెలిసినోళ్లను.. ఊళ్లోలను ఎంత అడిగినా మొండిచేయ్యే మిగులుతోంది. దీంతో ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్‌ను సంప్రదించి రూ.3 వడ్డీ చొప్పున భూమిని మార్టిగేజ్ చేసి రూ.20 లక్షలు తీసుకున్నాడు. పైగా ఏజెంట్‌కు కమీషన్ రూ.2 లక్షలు సమర్పించుకున్నాడు. ఇదీ ఒక్క సైదులు పరిస్థితే కాదు.. ఇలాంటి సర్పంచ్ అభ్యర్థులెందరో.. ప్రస్తుతం పడుతున్న యాతన ఇదీ.

కీలక దశకు ఎన్నికలు

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు (sarpanch elections) కీలక దశకు చేరుకుంటున్నాయి. ఎన్నికల బరిలోకి దిగిన సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఓవైపు ప్రచారం చేస్తూనే.. మరోవైపు చివరి దశలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కావాల్సిన సరంజమాను సిద్ధం చేసుకునేందుకు పాడరాని పాట్లు పడుతున్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అసలు ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న మీమాంసతో ముందస్తుగా సిద్ధం కాలేకపోయారు. అప్పటికే నోటిఫికేషన్ రావడం.. కోర్టు జోక్యంతో ఆగిపోవడం.. మళ్లీ పాత దామాషా ప్రకారమే పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ సర్కారు ముందుకుపోవడం.. బీసీ సంఘాల లొల్లి ఊపందుకోవడంతో ఎన్నికలు జరగడం కష్టమేనని లైట్ తీసుకున్నారు.

కానీ పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగుతుండడంతో పోటీలోకి దిగిన అభ్యర్థులకు పైసల కోసం తిప్పలు మొదలయ్యాయి. నిజానికి కాస్తంత టైమ్ ఉంటే.. ఎన్నికలకు కావాల్సిన డబ్బులను సర్దుబాటు చేసుకునేటోళ్లు.. కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో కొంతమంది అసలు పోటీ నుంచే తప్పుకున్న పరిస్థితి లేకపోలేదు. అయితే ప్రచార గడువు రోజురోజూకీ తరుముకొస్తుండడంతో పోలింగ్ ముందు రోజు పంచాల్సిన పైసలు, మద్యం సర్దుబాటు చేసుకోవడం సర్పంచ్ అభ్యర్థులకు తలకు మించిన భారంగా మారుతోంది.

ఫైనాన్షియర్ల చుట్టూ ప్రదక్షిణలు

ప్రధానంగా సర్పంచ్ అభ్యర్థులు ఒక్కో గ్రామపంచాయతీలో కనిష్టంగా రూ.20 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తే.. డిమాండ్ ఉన్న గ్రామపంచాయతీలు, గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు, రెవెన్యూ అధికంగా ఉండే గ్రామాల్లో ఖర్చు ఏకంగా రూ.50 లక్షల వరకు చేరుతోంది. దీంతో అంత పెద్దమొత్తంలో సర్దుబాటు చేసుకోవడం అభ్యర్థులకు కష్టంగా మారుతోంది. స్థిరాస్తులు ఉన్నప్పటికీ రియల్ మార్కెట్ డల్‌గా ఉండడం వల్ల క్రయవిక్రయాలపై స్తబ్దత నెలకొంది. ఒకవేళ ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూములు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చినా.. అడ్డికి పావుసేరు అన్న చందంగా అడుగుతుండడంతో సర్పంచ్ అభ్యర్థులకు డబ్బుల సర్దుబాటు వ్యవహారం తలనొప్పిగా మారింది. దీంతో ప్లాట్లు, భూముల కాగితాలు పట్టుకుని అభ్యర్థులు మార్టిగేజ్ లోన్ల కోసం బ్యాంకులు, ఫైనాన్సియర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడం కొసమెరుపు.

అప్పు పుట్టకపోవడానికి కారణం ఇదే..

గ్రామ పంచాయతీ ఎన్నికలకు (sarpanch elections) సంబంధించి ఒక్కో గ్రామంలో ఒక్కో పరిస్థితి ఉంది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు ఫుల్ డిమాండ్ ఉంటే.. మరికొన్ని గ్రామాల్లో మాత్రం ఆయా రాజకీయ పార్టీలకు మద్దతుదారులు దొరకడం గగనంగా మారింది. కొన్నిచోట్ల రాజకీయ పార్టీలైతే.. బ్రతిమిలాడి మరీ తమ మద్దతుదారులను నిలబెట్టిన పరిస్థితి లేకపోలేదు. ఎందుకంటే.. సర్పంచ్ ఎన్నిక కోసం భారీగా ఖర్చు చేయాల్సి రావడం.. ఆ తర్వాత ఆ స్థాయిలో రాబడి లేకపోవడం.. కాంట్రాక్టు పనులు చేసిన వాటికి బిల్లులు రాకపోవడం వంటి కారణాల నేపథ్యంలో సర్పంచ్ స్థానాలపై ఆసక్తి తగ్గిపోయింది. మరికొన్ని గ్రామాల్లో మాత్రం ఫుల్ డిమాండ్ ఉంది.

అయితే చాలాచోట్ల సర్పంచ్ అభ్యర్థులకు అప్పు ఇచ్చేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే.. ఆ అప్పు ఐదేండ్లు గడిచినా తీరే మార్గం లేకపోవడమే ప్రధాన కారణంగా కన్పిస్తోంది. ఇప్పుడు పంతానికి పోయి గెలిచేందుకు డబ్బులు ఖర్చు చేసినా.. మళ్లీ అప్పు తీర్చాలంటే మాత్రం ఆస్తులు అమ్ముకోవాల్సిందే. దీనికితోడు అప్పిచ్చిన వ్యక్తి సర్పంచ్‌గా గెలిస్తే.. ఒత్తిడి చేసి డబ్బులు వసూలు చేసుకోలేని పరిస్థితి. మళ్లీ సర్పంచ్‌తో ఏం అవసరం పడుతుందో తెలియదు. అలా అనీ డబ్బులు వదులుకోలేరు. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బులిచ్చి శత్రుత్వం కొనుక్కునే బదులు.. డబ్బులు ఇవ్వకపోవడం బెటర్ అని పరిస్థితి కన్పిస్తోంది.

Read Also: ‘మణుగూరు’లో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ కి రేగా వార్నింగ్

Follow Us On : X(Tiwtter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>