కేకేఆర్‌ను చిత్తు చేసిన లక్నో.. విజృంభించిన ముకుల్..

కలం, వెబ్ డెస్క్: ఉత్కంఠకు మారుపేరుగా సాగిన ఐపీఎల్ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అద్భుత విజయాన్ని అందుకుంది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును లోయర్ ఆర్డర్ బ్యాటర్ ముకుల్ చౌదరి తన అద్భుత బ్యాటింగ్‌తో గట్టెక్కించాడు. కేకేఆర్ నిర్దేశించిన 182 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖరి బంతి వరకు సాగిన పోరులో ముకుల్ అదరగొట్టాడు. ఒక దశలో ఓటమి ఖాయమనుకున్న స్థితి నుండి ముకుల్ సృష్టించిన సిక్సర్ల సునామీ కేకేఆర్ నోటికాడ విజయాన్ని లాగేసుకుంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే (41), యువ సంచలనం అంగ్‌క్రిష్ రఘువంశీ (45) రెండో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యంతో బలమైన పునాది వేశారు. అయితే, రఘువంశీ నిష్క్రమణ తర్వాత రింకూ సింగ్ (4) త్వరగానే అవుట్ కావడంతో కేకేఆర్ రన్ రేట్ తగ్గింది. ఈ దశలో రోవ్‌మన్ పోవెల్ (39 నాటౌట్), కెమెరాన్ గ్రీన్ (32 నాటౌట్) ఐదో వికెట్‌కు అజేయమైన 70 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ రతి (1/25) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు.

182 పరుగుల ఛేదనలో లక్నోకు ఆరంభంలోనే వైభవ్ అరోరా చుక్కలు చూపించాడు. కేవలం రెండు బంతుల వ్యవధిలో మార్‌క్రమ్ (22), మిచెల్ మార్ష్ (15)లను అవుట్ చేసి లక్నోను దెబ్బకొట్టాడు. అనంతరం ఆయుష్ బదోని (54) నిలకడగా ఆడి అర్ధ సెంచరీ పూర్తి చేసినప్పటికీ, మరోవైపు వికెట్లు పడుతూనే ఉన్నాయి. అనుకుల్ రాయ్ రెండు కీలక వికెట్లు తీయడంతో లక్నో 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కేకేఆర్ విజయం నల్లేరు మీద నడకే అని అందరూ భావించారు.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన ముకుల్ చౌదరి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కేవలం 27 బంతుల్లో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ముకుల్, తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 భారీ సిక్సర్లు బాదాడు. కేకేఆర్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుని ముకుల్ చేసిన దాడులకు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. సునీల్ నరైన్ 4 ఓవర్లలో కేవలం 13 పరుగులే ఇచ్చినప్పటికీ, ఇతర బౌలర్లు ముకుల్ దాడిని అడ్డుకోలేకపోయారు. చివరి ఓవర్లలో ముకుల్ వీరవిహారంతో లక్నో 19.6 ఓవర్లలో 182/7 స్కోరుతో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>