నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలు విడుదల

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖలో కొలువుల జాతర కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ నియామక ప్రక్రియలో భాగంగా మరో కీలక అడుగు పడింది. 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల (Nursing Officer Posts) భర్తీకి సంబంధించిన తుది ఫలితాలను గురువారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన నర్సుల సెలక్షన్ లిస్టును బోర్డు అధికారికంగా వెల్లడించింది. కాగా… ఈ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 42 వేల మంది నర్సింగ్ అభ్యర్థులు గత కొంతకాలంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

రెండేళ్లలో 12,649 పోస్టుల భర్తీ

వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కేవలం రెండు రోజుల క్రితమే 866 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు  మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా నర్సింగ్ ఆఫీసర్ల ఫలితాలు కూడా విడుదలవుతుండటంతో అభ్యర్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గడిచిన రెండేళ్ల కాలంలోనే ఆరోగ్యశాఖలో ప్రభుత్వం రికార్డు స్థాయిలో 10,327 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఇప్పుడు భర్తీ కానున్న 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులతో కలిపి, మొత్తం నియామకాల సంఖ్య 12,649కి చేరుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నియామకాలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

జూన్ నాటికి మరిన్ని కొలువులు

మరోవైపు, ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న మరిన్ని పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ప్రస్తుతం వివిధ విభాగాల్లో 4,374 పోస్టుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ నాటికి ఈ ప్రక్రియను కూడా పూర్తి చేసి, కొత్త అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయాలతో నిరుద్యోగ నర్సింగ్ అభ్యర్థుల నిరీక్షణకు తెరపడటమే కాకుండా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత తీరనుంది.

ప్రభుత్వానికి టీజీఎన్ఏ కృతజ్ఞతలు

2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, MHSRBకి తెలంగాణ నర్సస్ అసోసియేషన్ (TGNA) ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యంగా వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ చొరవ వల్లే నియామకాలు సకాలంలో పూర్తయినట్లు టీజీఎన్ఏ పేర్కొంది. ఉద్యోగాలకు ఎంపికైన నర్సింగ్ ఆఫీసర్లకు శుభాకాంక్షలు తెలిపింది. ఎంపికైన అభ్యర్థులంతా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తూ ముందుకు సాగాలని టీజీఎన్ఏ ఆకాంక్షించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>