కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీని గ్రామగ్రామాన బలోపేతం చేస్తామని పార్టీ జిల్లా పరిశీలకుడు గుంజపడుగు హరిప్రసాద్ తెలిపారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు పార్టీ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌ఛార్జి మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. తెలంగాణలో నిజమైన సామాజిక న్యాయం సాధ్యమయ్యేది టీఆర్ఎస్ పార్టీ ద్వారానేనని అన్నారు.
అన్ని వర్గాలకు అండగా ఉండాలనే..
నియోజకవర్గ పరిశీలకురాలు సౌజన్య రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంత నిరుద్యోగులు, ఉద్యమకారులు, అణగారిన వర్గాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో కవిత నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటైందన్నారు. “నీళ్లు – నిధులు – నియామకాలు” అనే లక్ష్యాలను గత, ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. తెలంగాణ ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన కవిత నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ విద్య, వైద్యం, రైతాంగం, కార్మికులు, యువత సామాజికంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసే దిశగా పాంచజన్యం పూరించిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకట రామమూర్తి, అసెంబ్లీ ఇన్‌ఛార్జి నండిల్లి ప్రభాకర్, నాయకులు జేపీ శ్యాంప్రసాద్, పూర్ణచంద్ర గౌడ్, మల్లేష్ యాదవ్, మంజులాదేవి, మహేందర్, నర్సింలు, సురేష్, లక్ష్మీనారాయణ, జడ్చర్ల ఉస్మాన్, బిర్లా ఎల్లయ్య పాల్గొన్నారు.

