కలం, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో నెలకొనాల్సిన పొలిటికల్ హీట్ (Telangana Politics) ఈసారి ఇప్పుడే మొదలైంది. మూడు ప్రధాన పార్టీల మధ్య నువ్వా.. నేనా.. అనే తీరులో సవాళ్ళు మొదలయ్యాయి. అన్ని పార్టీలూ ప్రజల్లోకి వెళ్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో కాంగ్రెస్ సమాయత్తమవుతున్నది. ఆరు గ్యారంటీలు, హామీల అమలులో ఫెయిలందంటూ బీఆర్ఎస్ రోడ్డెక్కుతున్నది. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పాలన కూడా ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని బీజేపీ ఆరోపిస్తున్నది. ఈ మూడు ప్రధాన పార్టీలకు తోడు కల్వకుంట్ల కవిత సొంతంగా పొలిటికల్ పార్టీ పెట్టి తన రాజకీయ భవిష్యత్తును పరిశీలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మూడు పార్టీలూ పోటాపోటీగా కార్యాచరణ చేపట్టాయి. ఈ హాడావిడి చూసిన తర్వాతనే ముఖ్యమంత్రి సైతం ఇక యాక్టివ్ కావాల్సిన టైమ్ వచ్చేసింది.. ఈసారి రాజకీయ వేడి చాలా ముందుగానే వచ్చేసింది.. అంటూ ఇటీవల నేతలతో వ్యాఖ్యానించారు.
సంక్షేమ పథకాల అమలు ధీమాతో కాంగ్రెస్ :
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లవుతున్నది. పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నది. దానికి అనుగుణంగా భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేసింది. కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. మరో రెండు నెలల్లో కొత్త చీఫ్ సెక్రటరీ కూడా రాబోతున్నారు. సాధారణ ఉద్యోగుల బదిలీ కూడా ఈ నెలాఖరుకు పూర్తికానున్నది. మంత్రివర్గంలోని రెండు ఖాళీ బెర్తులను కూడా వీలైనంత తొందరగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న మార్పులే ఎన్నికల వరకూ కొనసాగుతాయన్నది సచివాలయ వర్గాల అభిప్రాయం. ప్రస్తుతం కొనసాగుతున్న వెల్ఫేర్ స్కీమ్స్‌ను పటిష్టంగా అమలు చేయడంతో పాటు ఇంకా ప్రారంభం కావాల్సినవాటిని లాంచ్ చేయడంపై కసరత్తు జరుగుతున్నది. అన్ని సెక్షన్ల ప్రజలకూ సంక్షేమ ఫలాలను అందించినందున మరోసారి అధికారం ఖాయమనే ధీమాను పలు సందర్భాల్లో సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌ను కార్నర్ చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ :
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసేలా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ బహిరంగసభలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే జగిత్యాల సభను నిర్వహించింది. రెండు రోజుల్లో వరంగల్ సభకు సిద్ధమవుతున్నది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు ప్లాన్ చేస్తున్నది. ప్రజలకు దగ్గర కావాలన్న కేసీఆర్ పిలుపుతో రైతుల్లోకి చొచ్చుకెళ్ళే ప్రయత్నం మొదలైంది. వరి, మొక్కజొన్న కొనుగోళ్ళ అంశం మొదలు ప్రభుత్వ వైఫల్యాలను కేటీఆర్, హరీశ్‌రావు ఏకరువు పెడుతున్నారు. ముఖ్యమంత్రికి ఓపెన్ లెటర్లు రాస్తున్నారు. మరోవైపు ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటూ బలపడుతున్నామనే సంకేతాన్ని కేడర్‌కు పంపుతున్నది. శ్రేణులు డీలా పడ్డారని, సభ్యత్వం తగ్గిపోతున్నదని గ్రహించిన కేసీఆర్ వారిని ఉత్సాహపరిచే ప్రయత్నంతో పాటు మెంబర్‌షిప్ డ్రైవ్ మొదలుపెట్టాలని ఆదేశించారు. ఇప్పటివరకూ ఉన్న కమిటీలన్నింటినీ రద్దు చేసి పార్టీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారనే కాంగ్రెస్ ఆరోపణలతో బయటకు రాక తప్పలేదు.
మోదీ ఇమేజ్ మీదనే బీజేపీ ఆశలన్నీ :
స్థానిక ఎన్నికల మొదలు పార్లమెంటు ఎన్నికల దాకా మోదీ ఇమేజ్ తప్ప బీజేపీకి మరో బలమైన అస్త్రమే దొరకలేదు. ఆయన ప్రచారంతో 2024 పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు. ఈ ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మోదీ ఇమేజ్‌నే బీజేపీ వాడుకున్నది. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీని రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నది. బీబీనగర్ ఎయిమ్స్, వరంగల్‌లోని కాకతీయ టెక్స్‌టైల్ పార్కు, ములుగులోని సమ్మక్క ట్రైబల్ వర్శిటీ, హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ మార్గం, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ.. ఇలాంటి అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేయిస్తున్నది. బీజేపీలోని అంతర్గత కుమ్ములాటలు, గ్రూపుల తగాదాలతో గ్రాఫ్ పడిపోతున్నది. దీన్ని గమనించిన రాష్ట్ర నాయకత్వం మోదీ పర్యటనతో గాడిలో పెట్టాలని భావిస్తున్నది.

