కలం, తెలంగాణ బ్యూరో : సమ్మర్ హీట్ (Summer) పెరుగుతున్న తీరులోనే రాష్ట్రంలో బీరు అమ్మకాలు (Beer Sales) కూడా బాగా పెరుగుతున్నాయి. ప్రతి నెలా రికార్డు స్థాయి సేల్స్ నమోదవుతున్నది. జనవరి నెలలో 34 లక్షల కేసుల బీర్ అమ్ముడైతే వేడి పెరిగి పీక్‌కు చేరిన ఏప్రిల్ చివరి నాటికి అది 55 లక్షల కేసులకు చేరుకున్నది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు సగటున 23 లక్షల బీర్ బాటిళ్ళు అమ్ముడైనట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. నెల మొత్తంగా చూస్తే ఆరున్నర కోట్ల బాటిళ్లకు పైగా సేల్స్ రిజిస్టర్ అయింది. మే నెలలో టెంపరేచర్ 42 డిగ్రీల కంటే తగ్గడంలేదు. కొన్ని చోట్ల 46 డిగ్రీలు దాటుతున్నది. దీంతో సాయంత్రం కాగానే చిల్ అయిపోవాలని భావిస్తున్న మందుబాబులు బీర్‌తో సేదతీరుతున్నారు. ఐదేండ్ల కాలాన్ని పరిశీలిస్తే మార్చి నెలలో రికార్డు స్థాయిలో బీర్ సేల్స్ నమోదైంది. ఏప్రిల్ నెల ఆ రికార్డును దాటేసింది.
ఏడాదికి ఐదున్నర కోట్ల కేసుల బీర్ సేల్స్
సమ్మర్ వెరీ హాట్ గురూ.. చిల్డ్ బీర్ వెరీ నీడ్ గురూ.. అంటూ బీరును మంచినీళ్లలాగా తాగేస్తున్నారు మందుబాబులు. గతేడాది మొత్తం పన్నెండు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 536 లక్షల కేసుల బీర్ సేల్స్ అయినట్లు ఎక్సయిజ్ డిపార్టుమెంటు లెక్కలేసింది. ప్రతీ కేసుకు 12 బీర్ బాటిళ్లుంటాయి. అంచనాలకు మించి బీర్ సేల్స్ రిజిస్టర్ అవుతుండడంతో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించాలని రాష్ట్ర సర్కార్ గతేడాది ఫిబ్రవరిలో రేట్లు పెంచింది. కానీ సేల్స్ పడిపోయింది. 2024-25 కాలంలో మొత్తం 536 లక్షల కేసుల బీర్ సేల్స్ అయితే ధరలు పెంచిన కారణంగా గతేడాది ఇది 387 లక్షల కేసులకు (9%) పడిపోయింది. ధరలు పెంచితే ఈసారి కూడా అలాంటి పరిణామమే జరగొచ్చన్న అనుమానం ప్రభుత్వాన్ని వెంటాడుతున్నది. ధరలను పెంచాలని ఒత్తిడి వస్తున్నా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నది.
ఎక్సయిజ్ ఆదాయం ఎవర్ గ్రీన్
మద్యం ఆదాయంలో తెలంగాణ ఇప్పటికే అనేక రికార్డుల్ని అధిగమించింది. లైసెన్సు ఫీజు పెంచినా, దరఖాస్తు రుసుము పెంచినా కొత్త దుకాణాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వేలం పాటల్లో పోటీ పడి మరీ దక్కించుకుంటున్నారు వ్యాపారులు. ఒకపక్క అప్లికేషన్ల ఫీజు పెరిగింది. లైసెన్సు ఫీజు కూడా పెరిగింది. అయినా వ్యాపారులు వెనక్కి తగ్గలేదు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో (2015-16లో) మద్యం, బీర్ అమ్మకాల ద్వారా ఎక్సయిజ్ ఆదాయం 13 వేల కోట్లు కూడా దాటలేదు. కానీ ఐదేండ్లలోనే (2020-21లో) దానికి రెట్టింపు స్థాయికి చేరుకున్నది. కరోనా వచ్చే సమయానికి (2019-20లో) ఎక్సయిజ్ ఆదాయం రూ. 22,650 కోట్లు ఉంటే ఇప్పుడు (2025-26లో) కొత్త దుకాణాలకు అప్లికేషన్ రుసుము రూపంలో వచ్చిన ఆదాయాన్ని కలుపుకుంటే అది రూ. 44,557 కోట్లకు చేరుకున్నది. ఏడేండ్లలో లిక్కర్ రెవెన్యూ డబుల్ అయింది. పన్నెండేళ్ళ కాలాన్ని పరిశీలిస్తే మద్యం ఆదాయం మూడు రెట్లు పెరిగింది.
పన్నుల వాటాలో మద్యానిదే సింహభాగం
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది బడ్జెట్‌లో పన్నుల ద్వారా రూ. 1.45 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. సవరించిన అంచనాల్లో దాన్ని రూ. 1.34 లక్షల కోట్లకు తగ్గించింది. ఇందులో లిక్కర్ సేల్స్ ద్వారా ఎక్సయిజ్ రెవెన్యూ రూపంలో ప్రభుత్వానికి రూ. 44,557 కోట్లు సమకూరింది. అంటే 33% ఆదాయం వైన్ షాపుల ద్వారానే అందింది. ఇందులో కొత్త వైన్ షాపుల అప్లికేషన్ ఫీజు, పెంచిన ఫీజు, లైసెన్సు ఫీజు, బార్లకు పర్మిట్ ఫీజు తదితరాలన్నీ ఉన్నాయి. ఈసారి సమ్మర్‌లో బీర్ సేల్స్ తో రాష్ట్రానికి ఎక్సయిజ్ ఆదాయం కొంత పెరిగే అవకాశమున్నది. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులకు పలు హామీలు, పెండింగ్ డీఏ పేమెంట్, ప్రభుత్వ ఉద్యోగులకు వన్ టైమ్ రిలీజ్ కింద రూ. 6 వేల కోట్ల విడుదల ప్రణాళిక, ప్రతి నెలా వెయ్యి కోట్లు ఇప్పటికే విడుదల చేస్తుండడం.. వీటన్నింటితో బీర్ ధరలను పెంచుతుందా?.. గతేడాది అనుభవాలతో వాయిదా వేసుకుంటుందా?.. వేచి చూడాలి.
రాష్ట్రానికి ఎక్సయిజ్ ఆదాయం (కోట్ల రూ.లలో) ఇలా
2015-16 12,706
2016-17 14,184
2017-18 17,597
2018-19 20,859
2019-20 22,605
2020-21 27,286
2021-22 30,783
2022-23 35,145
2023-24 37,675
2024-25 37,488
2025-26 40,209
==========
బీర్ సేల్స్ (కేసుల్లో) :
నెల 2025 2026
జనవరి 31 లక్షలు 34 లక్షలు
ఫిబ్రవరి 28 లక్షలు 38 లక్షలు
మార్చి 30 లక్షలు 50.78 లక్షలు
ఏప్రిల్ 42 లక్షలు 55 లక్షలు

