కలం, ఆదిలాబాద్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన కుమ్రంబీమ్ ఆసిఫాబాద్ (Kumuram Bheem Asifabad) జిల్లాలోని మారుమూల గూడాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు లేని ఈ ప్రాంతాల్లో ఇప్పుడు యూరియా కొనుగోలు చేయడం రైతులకు ఒక పెద్ద ప్రహసనంగా తయారైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెల్ ఫోన్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవాల్సి రావడంతో, నెట్‌వర్క్ లేని మారుమూల గ్రామాల ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా బస్తాల బుకింగ్ కోసం రైతులు సెల్ సిగ్నల్ కోసం చెట్లు ఎక్కుతూ, ప్రాణాలను పణంగా పెట్టి సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది.
జిల్లాలోని పెంచికల్‌పేట మండలంలో గల గుండేపల్లి, మురళీగూడ, నాందిగామ్ వంటి వందలాది మారుమూల గూడాల్లో నేటికీ సరైన రహదారులు, సెల్ ఫోన్ నెట్‌వర్క్ సౌకర్యం లేదు. ఈ ప్రాంతాల్లోని ఆదివాసీలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో పంటలకు యూరియా ఎంతో అవసరం. అయితే, యాప్ లో బుకింగ్ చేసుకుంటేనే యూరియా ఇస్తామనే నిబంధన వీరి పాలిట శాపంగా మారింది. ఫోన్ మాట్లాడాలన్నా, ఇంటర్నెట్ సిగ్నల్ దొరకాలన్నా రెండు కిలోమీటర్ల దూరం నడవడమే కాకుండా ఎత్తైన కొండ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.
నెట్‌వర్క్ కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు రైతులు చెట్లు ఎక్కి గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడో ఒకసారి పొరుగున ఉన్న మహారాష్ట్ర సరిహద్దు సిగ్నల్స్ అందితే తప్ప యాప్ ఓపెన్ కావడం లేదు. తీరా అంత కష్టపడి యాప్ లో లాగిన్ అయ్యేసరికి యూరియా స్టాక్ అయిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బుకింగ్ విజయవంతమైనా, మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ దుకాణానికి వెళ్లేసరికి సరిపడా బస్తాలు దొరకడం లేదని వారు వాపోతున్నారు.
ఈ గూడాలు మండల కేంద్రానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో, దట్టమైన కీకారణ్యంలో ఉన్నాయి. అంత దూరం ప్రయాణించి వచ్చి, యాప్ సమస్యల వల్ల ఖాళీ చేతులతో తిరిగి వెళ్లడం రైతులకు ఆర్థికంగా, శారీరకంగా భారంగా మారింది. ఈ డిజిటల్ ఇబ్బందుల నుండి తమకు విముక్తి కల్పించాలని ఆదివాసీ రైతులు కోరుతున్నారు. మారుమూల గూడాల రైతులకు ఎలాంటి ఆన్‌లైన్ యాప్ బుకింగ్ నిబంధనలు లేకుండా, నేరుగా లారీల ద్వారా యూరియాను సరఫరా చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

