కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక నిర్ణయాలను ప్రకటించారు. మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగడానికి అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో కార్పొరేట్ స్థాయిలో మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రారంభించడానికి వీలుగా సమగ్ర ప్రణాళికలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్లతో పాటు మహిళలు వ్యాపార రంగంలో మరింతగా రాణించడానికి స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ప్రతి మండలంలో రైస్ మిల్లులు, గోడౌన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. బ్యాంకుల నుంచి వీటికి అవసరమైన రుణాలను ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల కోసం 8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు ముఖ్యమంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహిళలకు అందించే ఇందిరమ్మ చీరల డిజైన్లను ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో విడుదల చేశారు.

