కలం, వెబ్‌డెస్క్: హిందూ సంప్రదాయంలో శివారాధనకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. పరమశివుడిని భోళాశంకరుడిగా కొలుస్తూ, ఇంట్లోనే శివలింగాన్ని (Shiva Lingam) పూజించాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ సరైన అవగాహన లేకుండా, నియమాలు పాటించకుండా ఇంట్లో శివలింగాన్ని పెడితే పూజా ఫలం లభించకపోగా, కొన్నిసార్లు ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఇంట్లో శివలింగం ప్రతిష్ఠించవచ్చా? ఉంచితే ఎలాంటి నియమాలు పాటించాలి? ఏ పరిమాణంలో ఉండాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో శివలింగం ఉంచవచ్చా?
శైవ ఆగమాలు, పురాణాల ప్రకారం ఇంటి పూజ గదిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. స్త్రీ, పురుష భేదం లేకుండా ఎవరైనా భక్తితో శివారాధన చేయవచ్చని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా నిత్యం అభిషేకం, బిల్వార్చన, శివనామ స్మరణ చేస్తే ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుందని విశ్వసిస్తారు. అయితే శివలింగాన్ని ఇంట్లో ఉంచిన తర్వాత పరిశుభ్రత, నియమ నిష్ఠలు పాటించడం ముఖ్యమని చెబుతారు. ప్రతిరోజూ అభిషేకం చేయలేని పరిస్థితిలో శివలింగాన్ని ఒక పాత్రలో ఉంచి, దానిపై నీరు ఉండేలా చూసుకోవడం మంచిదని ఆచారవేత్తలు సూచిస్తున్నారు.
శివలింగం ఎంత పరిమాణంలో ఉండాలి?
ధర్మశాస్త్రాల ప్రకారం ఇంటి పూజ గదిలో ప్రతిష్ఠించే శివలింగం చాలా పెద్దదిగా ఉండకూడదట. ఇంట్లో పూజించే శివలింగం మన చేతి బొటనవేలు మొదటి కణుపు (Thumb’s first phalanx) లేదా పూర్తి బొటనవేలు పరిమాణం కంటే పెద్దదిగా ఉండకూడదట. ముఖ్యంగా బేసి సంఖ్యల పరిమాణాన్ని శుభప్రదంగా భావిస్తారు. అంటే ఒకటి, మూడు, ఐదు లేదా ఏడు అంగుళాల ఎత్తులో ఉన్న శివలింగం గృహపూజకు అనుకూలమని అర్థం. ముఖ్యంగా ఏడు అంగుళాలకు మించిన శివలింగాన్ని ఇంట్లో ప్రతిష్ఠించకపోవడం మంచిదని భావిస్తారు.
శివలింగాన్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడు పాటించాల్సిన నియమాలు
- శివలింగాన్ని ఎప్పుడూ పరిశుభ్రమైన ప్రదేశంలోనే ఉంచాలి
- ప్రతిరోజూ నీరు లేదా పంచామృతంతో లింగానికి అభిషేకం చేయడం మంచిది
- బిల్వదళాలతో లింగాన్ని పూజిస్తే శివుని కృప లభిస్తుందని విశ్వాసం
- పూజ గదిలో ఎప్పుడూ ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి
- శివలింగాన్ని నేరుగా నేలపై కాకుండా పీఠంపై ప్రతిష్ఠించాలి
భక్తి, శ్రద్ధతో చేసిన శివారాధన మనసుకు ప్రశాంతతను, ఇంటికి ఆధ్యాత్మిక శుభశక్తిని తీసుకువస్తుందని శైవ సంప్రదాయం చెబుతోంది. అయితే నియమాలు పాటించకపోవడం వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుందని చెబుతున్నారు నిపుణులు. కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు, మనస్పర్థలు రావడం, ఆర్థిక ఇబ్బందులు వంటి నష్టాలు కలిగే ప్రమాదం ఉందని, కాబట్టి నిష్ఠగా పూజించగలిగినప్పుడే శివలింగాన్ని పెట్టుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

