కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో ధాన్యం సేకరణపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వాఖ్యలు చేశారు. ఎంత భారమైనా సరే, రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు దళారుల బారిన పడి మోసపోకుండా ఉండేందుకే ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లిస్తూ పంట ఉత్పత్తులను సేకరిస్తోందని తెలిపారు. దేశంలో యాసంగి సీజన్‌లో సేకరించిన మొత్తం ధాన్యంలో తెలంగాణ వాటానే ఏకంగా 60 శాతం నమోదైందని, ధాన్యం కొనుగోళ్లలో దేశంలో మరే రాష్ట్రం కూడా మనతో పోటీపడే పరిస్థితి లేదని ఆయన ప్రకటించారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రెండున్నరేళ్ల కాలంలో ధాన్యం కొనుగోళ్ల కోసమే రికార్డు స్థాయిలో రూ.82 వేల 840 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం వివరించారు. ప్రస్తుత యాసంగి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని, ఇప్పటివరకు 63.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, సుమారు రూ. 11 వేల 903 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యానికి కూడా ప్రభుత్వం కొనుగోలు మద్దతు ఇచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
మరోవైపు రాష్ట్రంలో సాంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులు అడుగులు వేస్తున్నారని సీఎం తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యాసంగిలో సుమారు 16 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4 లక్షల ఎకరాల్లో జొన్న సాగు చేసి తెలంగాణ రైతులు సరికొత్త చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఈ పంటల కొనుగోళ్లకు గాను మొక్కజొన్నలకు సుమారు రూ. 4 వేల 275 కోట్లు, జొన్న కొనుగోళ్లకు ఇప్పటి వరకు రూ. 1154 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించి రైతులకు అండగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వివరించారు.

