తెలంగాణ నేతలకు ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) టార్గెట్ అయ్యారు. ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా ఆయన మీద దాడి చేస్తున్నారు. ఎప్పుడో పది రోజుల కింద చేసిన కామెంట్లకు తాజాగా ఆయన మీద దాడులు చేస్తుండటం గమనార్హం. కొంతకాలం క్రితం పవన్ కల్యాణ్ కోనసీమ రైతులతో మాట్లాడుతూ.. కోనసీమ ప్రాంతం ఒకప్పుడు కళకళలాడేదని.. అయితే వారికి తెలంగాణ నేతల దిష్టి తగిలిందేమో అందుకే పచ్చదనం తగ్గిందందటూ కామెంట్ చేశారు. అప్పట్లోనే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. కొందరు తెలంగాణ వాదులు, నెటిజన్లు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. కానీ ముఖ్యమైన నేతలెవరూ పెద్దగా ఖండించలేదు. జగదీశ్ రెడ్డి లాంటి బీఆర్ఎస్ నేతల మినహా మొదట్లో పెద్దగా స్పందన రాలేదు.
అయితే తాజాగా ఉన్నట్టుండి పవన్ కల్యాణ్ మీద మూకుమ్మడి దాడి మొదలైంది. రెండ్రోజుల మొదట జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన పారిశ్రామిక వేత్తలంగా హైదరాబాద్‌లోనే వ్యాపారాలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ సినిమాలను తెలంగాణ రాష్ట్రంలో ఆడనివ్వబోమంటూ ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వంటి నేతలంతా వరసగా పవన్ కల్యాణ్ మీద మాటల దాడి మొదలుపెట్టారు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే ఆయన ఈ కామెంట్లు చేసిన 10 రోజలు తర్వాత ఎందుకు స్పందిస్తున్నారు? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనా?
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం(HILT) పై బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ పాలసీ వెనుక భారీ అవినీతి దాగి ఉందని వారు ఆరోపిస్తున్నారు. కేవలం ప్రభుత్వ పెద్దలకు మేలు చేసేందుకే ఈ పాలసీని తీసుకొచ్చారని విమర్శిస్తున్నారు. బీజేపీ నేతలు ఏకంగా గవర్నర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే ఈ టాపిక్ మీద చర్చ జరగొద్దనే పవన్ కల్యాణ్ ఇష్యూను ఆలస్యంగా కాంగ్రెస్ నేతలు తెరమీదకు తీసుకొచ్చారని బీఆర్ఎస్ నేతలు, నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
బీఆర్ఎస్ కూడా మౌనంగానే..
తెలంగాణకు సంబంధించిన ఏ అంశంమీదైనా ముందుగా స్పందించేది బీఆర్ఎస్ పార్టీ. కానీ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు పెద్దగా స్పందించలేదు. కేవలం ఆ పార్టీలోని ద్వితీయశ్రేణి నేతలే మాట్లాడారు. తెలంగాణ ఆత్మగౌరవం గురించి నిరంతరం మాట్లాడే బీఆర్ఎస్ నేతలు ఈ విషయం మీద ఎందుకు స్పందించలేదన్న చర్చ జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు స్పందించేసరికి అనివార్యంగా బీఆర్ఎస్ లీడర్లు కూడా స్పందించడం మొదలుపెట్టారు. మొత్తంగా పవన్ కల్యాణ్ చాలా రోజుల తర్వాత మరోసారి తెలంగాణ నేతలకు టార్గెట్ అయ్యారు.
పవన్(Pawan Kalyan) అభిమానులు మాత్రం విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉందని.. కానీ కొందరు స్వార్థపరులు కావాలనే సెంటిమెంట్ రగిల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్ ఉద్దేశ్యపూర్వకంగా ఆ కామెంట్లు చేయలేదని.. మాటల సందర్భంలో యథాలాపంగా ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని చెబుతున్నారు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుంది? పవన్ కల్యాణ్ స్పందిస్తారా? అన్నది వేచి చూడాలి.
Read Also: చంద్రబాబుకు ఊరట.. లిక్కర్ కేసు క్లోజ్
Follow Us on: Facebook


