తెలంగాణలో నేటి నుంచి భూముల ధరలు పెంపు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో నేటి నుంచి భూముల ధరలు (Telangana Land Rates) పెరిగాయి. ప్రాంతాలవారీగా భూముల విలువ 50-100 శాతం, ప్రైమ్ ఏరియాల్లో భూముల మార్కెట్ విలువ 100% పెంచినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1200-రూ.1400 కోట్ల ఆదాయం సమకూరనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లు, అపార్టుమెంట్లు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూముల కొత్త ప్రభుత్వ మార్కెట్ ధరలు అధికారికంగా అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలోని 144 సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీసులలో ఈ కొత్త విలువల ఆధారంగానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ ధరలకు ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడానికి రేవంత్ సర్కార్ దాదాపు 92 వేల ప్రాంతాల్లో శాస్త్రీయంగా ధరల సవరణ చేసింది. అభివృద్ధిని బట్టి ధరల పెంపును కనిష్టంగా 25 శాతం.. 50, 75, గరిష్ఠంగా 100 శాతంగా పేర్కొంటూ నాలుగు స్లాబులుగా విభజించారు.

 పాత రేటు ప్రకారమే రిజిస్ట్రేషన్ ఛార్జీలు..

రాష్ట్రంలో భూముల ధరలు పెరిగినప్పటికీ రిజిస్ట్రేషన్ ఛార్జీలను మాత్రం పాత రేటు ప్రకారం (7.5 శాతం) కొనసాగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ సవరణల ప్రకారం గ్రామాల్లో ఇప్పటివరకు ఎకరా కనిష్ఠ ధర 1.75 లక్షలు ఉండగా, దానిని ఇప్పుడు 2.75 లక్షలకు పెంచారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎకరా కనిష్ఠ ధరను 5 లక్షలుగా, హెచ్ఎండీఏ పరిధిలో 10 లక్షలుగా, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 15 లక్షలుగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోకాపేట, నానక్‌రాంగూడ, కొంగరకలాన్, రాయ్‌దుర్గ్, బుద్వేల్ వంటి ఐటీ, కమర్షియల్ హబ్‌లలో మార్కెట్ విలువలను గరిష్ఠంగా 100 శాతం పెంచారు. అయితే బేగంపేట పైగాలో ఉన్న అత్యధిక గరిష్ఠ ధర (ఎకరాకు 35.29 కోట్లు) లో ఎలాంటి మార్పు చేయలేదు. అపార్ట్‌మెంట్ల విషయానికి వస్తే ఫ్లాట్ల విలువను 10 నుంచి 20 శాతం వరకు పెంచడంతో పాటు, ఒకే అపార్ట్‌మెంట్‌లో ఫ్లోర్‌ను బట్టి ఉండే ధరల వ్యత్యాసాలను తొలగించి ఒకేరకంగా ధరలను నిర్ణయించారు.

4 రోజుల్లోనే 14,774 రిజిస్ట్రేషన్లు..

ప్రజలకు అత్యుత్తమ సేవలే లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థలో స‌మూల మార్పులు చేశామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. కార్పొరేట్ స్ధాయిలో ఇంటిగ్రేటెడ్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని.. ఇప్పటికే నాలుగు ఇంటిగ్రేటెడ్ భ‌వ‌నాలకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 4788, వాట్స్ యాప్ నెంబర్ 8247619983 కు కాల్ చేయాలని సూచించారు. నేటి నుంచి భూముల మార్కెట్ విలువలు పెరగడంతో చివరి రోజు గురువారం రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిక్కిరిశాయి. 4 రోజుల్లోనే 14,774 ఏకంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. 35 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల ఆదాయం వచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>