కలం, హుజూర్ నగర్: అది ఒక సాధారణ మధ్యతరగతి ఇల్లు.. నెలనెలా వచ్చే వందల రూపాయల బిల్లే వారికి కాస్త భారం. అలాంటిది, ఈ నెల వచ్చిన విద్యుత్ బిల్లు చూసి ఆ ఇంటి యజమాని గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. ఏకంగా కోటి రూపాయలకు పైగా బిల్లు రావడంతో సదరు వినియోగదారుడు అవాక్కయ్యాడు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో వెలుగుచూసిన ఈ వింత ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
అసలేం జరిగిందంటే.. పాలకీడు (Palakeedu) మండలం కొత్త తండా గ్రామానికి చెందిన ఒక సాధారణ గృహ వినియోగదారునికి ఈ నెల విద్యుత్ రీడింగ్ తీసిన అనంతరం బిల్లు చేతికి ఇచ్చారు. ఎప్పటిలాగే వందల్లో వస్తుందని భావించిన యజమానికి బిల్లుపై ఉన్న మొత్తాన్ని చూసి ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ బిల్లుపై అక్షరాలా రూ.1,27,79,406 (కోటి 27 లక్షల 79 వేల 406 రూపాయలు) అని ముద్రించి ఉంది. ఆ సాధారణ ఇంటికి, కేవలం లైట్లు, ఫ్యాన్లు మాత్రమే వాడే కుటుంబానికి కోటికి పైగా బిల్లు రావడంపై సదరు యజమాని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఏం చేయాలో పాలుపోక, ఈ విషయాన్ని స్థానికులకు, అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ వింత బిల్లు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.
ఈ షాకింగ్ ఘటనపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఇది ముమ్మాటికీ సాంకేతిక లోపం వల్ల జరిగిన పొరపాటేనని స్పష్టం చేశారు. బిల్లింగ్ మిషన్‌లో రీడింగ్ నమోదు చేసేటప్పుడు సాఫ్ట్‌వేర్ లోపం కారణంగానే ఇలాంటి భారీ మొత్తం ముద్రితమైందని అధికారులు తెలిపారు. సదరు వినియోగదారుడు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ బిల్లును తక్షణమే సరిచేసి, అసలైన రీడింగ్ ప్రకారం ఎంత బిల్లు వస్తుందో అంత మాత్రమే వసూలు చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. సాధారణంగా అక్కడక్కడా వేలల్లో బిల్లులు తారుమారవడం చూస్తుంటాం.. కానీ ఏకంగా ఒక పల్లెటూరి సాదాసీదా ఇంటికి కోటి రూపాయల బిల్లు రావడం మాత్రం జిల్లావ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

