కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ (Telangana), కర్ణాటక మధ్య కొత్త బ్యారేజీల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలంలో కొల్పూర్ దగ్గర ఒక బ్యారేజీ, భీమా నదిపై తంగిడి గ్రామం వద్ద మరో బ్యారేజీ నిర్మాణం కాబోతుంది. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన అంశాలు, బ్యారేజీల నిర్మాణంతో తలెత్తిన విభేదాలపై రెండు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు బోసు రాజు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య హైదరాబాద్‌లో చర్చలు జరిగాయి. తాగు, సాగునీటి అవసరాలు, వినియోగంపై చర్చించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా కొత్తగా నిర్మించనున్న ప్రాజెక్టులు, బ్యారేజీలపై చర్చించారు. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండడంతో ఈ చర్చలు ఫలప్రదంగా జరిగాయని సమాచారం.
జాయింట్ కమిటీ ఏర్పాటు..
రెండు రాష్ట్రాల సంయుక్త భాగస్వామ్యంతో కృష్ణా, భీమా నదులపై రెండు చోట్ల బ్యారేజీలు కట్టాలని ఈ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీనిపై మరింత విస్తృతంగా చర్చలు జరిపేందుకు వీలుగా రెండు రాష్ట్రాల ప్రతినిధులతో జాయింట్ కమిటీని ఏర్పాటు చేయాలని ఇద్దరు మంత్రులు అభిప్రాయపడ్డారు.

