Mobile Popup Ad
Mobile Popup Ad

మంత్రుల మధ్య గ్యాప్.. విపక్షాలకు అడ్వాంటేజ్!!

కలం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ నేతల మధ్య కొరవడిన కోఆర్డినేషన్, మంత్రుల (Congress Ministers) మధ్య ఏర్పడిన గ్యాప్ ప్రతిపక్షాలకు ప్రధాన రాజకీయ అస్త్రంగా మారింది. ప్రభుత్వాన్ని విమర్శించినా, ముఖ్యమంత్రిని తిట్టినా అటు మంత్రులు, ఇటు కాంగ్రెస్ లీడర్లు స్పందించరన్నది బీఆర్ఎస్, బీజేపీ లీడర్ల అభిప్రాయం. చివరకు అది పీసీసీ చీఫ్ విషయంలోనూ కంటిన్యూ అవుతున్నది. సొంత పార్టీ అధినేతకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నా ఆ పార్టీ లీడర్లు ప్రొటెక్ట్ చేసుకోకపోవడం చర్చనీయాంశమైంది. “పార్టీ ఉంటేనే మనకు ఉనికి.. పార్టీకి దూరమైతే మనం జీరో… పార్టీని కాపాడుకోవడం మనందరి బాధ్యత…” ఇలాంటి డైలాగులు చాలామంది రాజకీయ నాయకులు నిత్యం చెప్పేది. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం “మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ.. ఎవరు ఏదైనా కామెంట్ చేసుకోవచ్చు.. మాకు హైకమాండే బాస్.. రాష్ట్రంలో బాస్‌లు ఎవరూ ఉండరు.. మేం ఒరిజినల్ కాంగ్రెస్..” ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి.

ప్రభుత్వంపై విమర్శలొస్తే సమిష్టిగా అది మంత్రులందరినీ విమర్శించినట్లేనని ఏ మంత్రీ భావించడంలేదు. గతంలో సింగరేణి టెండర్ల విషయంలో ఆరోపణలు వస్తే అది ఆ శాఖకు, ఆ మంత్రికి మాత్రమే సంబంధించిన వ్యవహారంగా మిగిలిన మంత్రులంతా భావించి సైలెంట్‌గా ఉండిపోయారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మైనింగ్ ఆరోపణలు వస్తే స్వయంగా ఆయనే స్పందించాల్సి వచ్చింది. ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి విషయంలో పౌర సరఫరాల శాఖ మంత్రే సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చింది. మంత్రులు వారివారి శాఖలకు మాత్రమే పరిమితమయ్యారని, ప్రభుత్వ విధానాలను తప్పుపట్టే తీరులో విపక్షాలు విమర్శిస్తూ ఉంటే ‘టీమ్ స్పిరిట్‌’తో వ్యవహరించి రియాక్ట్ కావాల్సిన మంత్రులు ఎందుకు గిరిగీసుకుని కూర్చున్నారంటూ ఏఐసీసీ నేతలు గతంలో పలుమార్లు సున్నితంగా హెచ్చరించారు. అయినా అదే ధోరణి కంటిన్యూ అవుతున్నది.

ఇక మంత్రులో ఒకరంటే ఒకరికి పడని తీరు పలు సందర్భాల్లో వ్యక్తమైంది. గతంలో సహచర మంత్రిని ఉద్దేశించి పొన్నం ప్రభాకర్ వ్యవహరించిన తీరు, తాజాగా క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించే సమయంలో మరో మంత్రి విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహరించిన తీరు వివాదాస్పదమయ్యాయి. మంత్రుల మధ్యనే గాప్ ఉన్నదని, ముఖ్యమంత్రికి మరికొద్దిమంది మంత్రులకు గ్యాప్ ఉన్నదనేది సచివాలయం, అసెంబ్లీ ప్రాంగాణాల్లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు గుసగుసగా చెప్పుకున్నారు. సరిగ్గా ఇలాంటి బలహీతనలే బీఆర్ఎస్, బీజేపీలకు అడ్వాంటేజ్‌గా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మినహా మిగిలిన మంత్రులకు ఈ ప్రభుత్వాన్ని ఓన్ చేసుకోవాలనే ఆలోచనే లేదన్న మాటలూ గాంధీభవన్‌లో వినిపిస్తున్నాయి. పరుష పదాలతో ముఖ్యమంత్రిని దూషించినా మంత్రులు పట్టీపట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారన్న అపవాదు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది.

పార్టీ స్టేట్ చీఫ్‌గా మహేశ్‌కుమార్ గౌడ్‌కు వ్యతిరేకంగా మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నా ఆయన తరఫున పార్టీ ప్రతినిధులు స్పందించకపోవడం తాజాగా ఆ జాబితాలో ఒకటిగా చేరింది. పార్టీ పెద్దను ఎవరైనా విమర్శిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేయడం గతంలో ఒక ఆనవాయితా మారింది. బీఆర్ఎస్ అధినేతను పరుషంగా మాట్లాడినా, దూషించినా ఆ పార్టీ నేతలు వేర్వేరు రూపాల్లో ప్రశ్నించడం, ఘాటుగా కౌంటర్‌లు ఇవ్వడం ఇప్పటికీ కొనసాగుతున్నది. కానీ కాంగ్రెస్‌లో మాత్రం పీసీసీ చీఫ్‌ను విమర్శించినా ఆ పార్టీ నేతలు అంటీ ముట్టనట్లుగానే ఉన్నారు. ప్రభుత్వ పథకాలను చులకన చేసినా, అమలు కావట్లేదని విమర్శలు చేసినా కొద్దిమంది ఎమ్మెల్యేలు మినహా మంత్రులు స్పందించకపోవడం విపక్షాలకు అనుకూలంగా మారింది. పార్టీ మొత్తాన్ని లీడ్ చేయాల్సిన పీసీసీ చీఫ్ స్వయంగా ఆరోపణలు ఎదుర్కొంటే ఆయనకు మద్దతుగా నిలిచే తీరులో ఎవ్వరూ ఎందుకు స్పందించలేదన్నదే ఇప్పుడు గాంధీభవన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>