epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

దివ్యాంగుల పెళ్లికి రూ.2లక్షలు: సీఎం రేవంత్​ రెడ్డి

కలం, వెబ్​డెస్క్​: దివ్యాంగులకు, వృద్ధులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (Revanth Reddy) అన్నారు. సోమవారం ప్రజాభవన్​లో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. రూ.50కోట్ల విలువ చేసే ఉపకరణాలను దివ్యాంగులకు ఉచితంగా అందించారు. చిన్నపిల్లల సంక్షేమం కోసం బాల భరోసా పథకం, వృద్ధుల సంరక్షణ కోసం ‘ప్రణామ్​’ డే కేర్​ సెంటర్లు ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడారు. దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడేలా కాంగ్రెస్​ ప్రభుత్వం మానవీయ కోణంలో పనిచేస్తోందన్నారు. ఒక కుటుంబసభ్యుల్లా వాళ్లకు భరోసా కల్పించేందుకు ఎన్నడూ లేనివిధంగా రూ.50కోట్లు కేటాయించి ఉచితంగా ఉపకరణాలు అందిస్తున్నట్లు చెప్పారు. విద్య, ఉద్యోగాల భర్తీలో దివ్యాంగులకు కోటా పక్కాగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో పారాలింపిక్స్​లో విజయం సాధించిన అమ్మాయికి ఉద్యోగమిచ్చినట్లు తెలిపారు. దివ్యాంగుల పెళ్లికి రూ.2 లక్షలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.

పోటీ ప్రపంచంలో వెనకబడ్డామనే ఆలోచన లేకుండా అన్ని రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తున్నట్లు సీఎం చెప్పారు. వీటిని ఉపయోగించుకుని ఆత్మస్థైర్యంతో జీవితంలో ఎదగాలని సూచించారు. వైకల్యం అనే ఆలోచన రానీకుండా ఉన్నత స్థాయికి చేరిన గొప్ప వ్యక్తి మాజీ కేంద్ర మంత్రి జైపాల్​ రెడ్డి అని, ‘బెస్ట్ పార్లమెంటేరియన్’​గా ఎదిగిన ఆయన దివ్యాంగులకు స్ఫూర్తి అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కో ఆప్షన్ మెంబర్​గా ట్రాన్స్ జెండర్​ని కార్పొరేటర్​గా నామినేట్ చేయాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా తమ సమస్యలపై వాళ్లకు మాట్లాడుకునే అవకాశం కలుగుతుందన్నారు.

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో కోత..

వృద్ధులకు ప్రభుత్వమే కుటుంబంగా మారి ‘ప్రణామ్’ పేరుతో డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తోందని సీఎం రేవంత్​ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే.. ప్రతీ నెల వారి జీతంలో 10 శాతం తల్లిదండ్రులకు అందించేలా చట్టం తేనున్నట్లు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదులను పరిశీలించి పిల్లల జీతంలో నుంచి నేరుగా 10 శాతం తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికి నూటికి నూరు శాతం వైద్యం అందించాలన్న లక్ష్యంతో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో హెల్త్ పాలసీ తీసుకురానున్నట్లు చెప్పారు.

ప్రజాభవన్​లో అందరికీ ప్రవేశం..

తెలంగాణ సమాజం సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కోరుకుంటోంది. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులగణన నిర్వహించిందని సీఎం చెప్పారు. ‘తెలంగాణ ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన నిర్వహించేందుకు అంగీకరించింది. తెలంగాణ కులగణన మోడల్​ను దేశం అనుసరిస్తోంది. ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి సమాన అవకాశాలు కల్పిస్తున్నాం. ఒకప్పుడు సామాన్యులకు ప్రవేశం లేని ప్రజా భవన్​లో ఇప్పుడు అందరికీ ప్రవేశం కల్పించాం. ఈ ప్రభుత్వానికి ధర్మ గంట ఉంది.. ఎవరు ఏ సమస్యలు చెప్పినా విని పరిష్కరిస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా, పేదల సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం’ అని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.

Read Also: సంక్రాంతి సెలవుల్లో కవిత.. కొత్త పార్టీపై సమాలోచనలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>