నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో ‎HRC చైర్మన్ తనిఖీ

‎కలం, నల్లగొండ: ప్రజా సమస్యల పరిష్కారంలో నల్గొండ జిల్లా అధికార యంత్రాంగం చూపిస్తున్న వేగవంతమైన స్పందన, బాధ్యతాయుతమైన పనితీరు అభినందనీయమని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (Telangana HRC Chairperson) చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ (Justice Shameem Akther) ప్రశంసించారు. జిల్లా అధికారుల కృషి వల్లే ఈ ఏడాది మానవ హక్కుల ఉల్లంఘన కేసులు గణనీయంగా తగ్గాయని వెల్లడించారు. బుధవారం జిల్లా కేంద్ర పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని అత్యవసర విభాగం, ఐసీయూ, యుడీఐడీ కేంద్రాలను తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో జస్టిస్ షమీమ్ అక్తర్ విలేకరులతో మాట్లాడారు. గత ఏడాదితో పోలిస్తే నల్గొండ జిల్లా నుంచి ఈ సంవత్సరం అతి తక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయన్నారు. గతేడాది జిల్లా నుంచి 45 నుంచి 50 కేసులు రాగా, ఒక్కటి మినహా అన్నింటినీ జిల్లా యంత్రాంగం వేగంగా పరిష్కరించిందని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 5 కేసులు మాత్రమే నమోదు కావడం అధికారుల సమర్థవంతమైన పనితీరుకు నిదర్శనమన్నారు.

ఆ కేసుల్లోనూ అధికారులు వెంటనే స్పందించి కమిషన్‌కు పూర్తి నివేదికలు సమర్పించారని జస్టిస్ షమీమ్ అక్తర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హెచ్‌ఆర్‌సీలో గతంలో పెండింగ్‌లో ఉన్న 17 వేల కేసుల్లో ఇప్పటివరకు 15 వేలకు పైగా పరిష్కరించినట్లు చైర్మన్ తెలిపారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా సంబంధిత అధికారులను పిలిపించి చర్యలు తీసుకుంటున్నామని జస్టిస్ షమీమ్ అక్తర్ స్పష్టం చేశారు.

‎సాధారణ ప్రసవాలనే ప్రోత్సహించాలి :

‎నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి పనితీరుపై హెచ్‌ఆర్‌సీ చైర్మన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రికి నిత్యం 1,200 మంది అవుట్‌ పేషెంట్లు వస్తున్నారని, 700 మంది ఇన్‌పేషెంట్లకు వసతి సామర్థ్యం ఉందని తెలిపారు. ప్రతి నెలా సగటున 800 ప్రసవాలు జరుగుతుండగా, అందులో 60 శాతం సాధారణ ప్రసవాలు, 40 శాతం సిజేరియన్లు అవుతున్నాయని చెప్పారు. నూటికి నూరు శాతం సాధారణ ప్రసవాలే అయ్యేలా గర్భిణులకు, వారి కుటుంబ సభ్యులకు చైతన్యం కల్పించాలని వైద్యులకు జస్టిస్ షమీమ్ అక్తర్ (Telangana HRC Chairperson) సూచించారు.

అత్యవసర పరిస్థితిలో తప్ప సాధ్యమైనంత వరకు సిజేరియన్లు చేయకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన నిపుణులైన డాక్టర్లు, ఆధునిక వసతులు అందుబాటులో ఉన్నాయని ప్రజలు వీటిని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ రాహుల్, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేష్, పలువురు వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.

Also Read : పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ అనుమానాస్ప‌ద మృతి!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>