పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ అనుమానాస్ప‌ద మృతి!

క‌లం, స్పోర్ట్స్‌: భారత పారా అథ్లెటిక్స్‌లో విషాదం నెలకొంది. ఆసియా పారా గేమ్స్‌లో మూడు స్వర్ణ పతకాలు సాధించిన నీరజ్ యాదవ్ (Neeraj Yadav) ఢిల్లీలోని తన నివాసంలో మంగళవారం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక వార్తలు వెలువడ్డాయి. భారత పారా అథ్లెటిక్స్‌ కోచ్ ఎస్. సత్యనారాయణ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బుధవారం ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆయన మృతికి దారితీసిన పరిస్థితులు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన నీరజ్‌ (Neeraj Yadav) ఏడేళ్ల వయసులో పోలియో కారణంగా పక్షవాతానికి గురయ్యారు. అయినా క్రీడల్లో రాణించారు. తొలుత వీల్‌చైర్‌ టెన్నిస్‌లో పాల్గొన్న ఆయన, ఆ తర్వాత పారా అథ్లెటిక్స్‌ వైపు వచ్చారు. 2018 జకార్తా ఆసియా పారా గేమ్స్‌లో జావెలిన్‌ త్రోలో స్వర్ణం సాధించారు. 2023లో జరిగిన హాంగ్‌జౌ ఆసియా పారా గేమ్స్‌లో జావెలిన్‌, డిస్కస్‌ త్రోల్లో పసిడి పతకాలు గెలిచారు. అయితే, డోపింగ్‌ కేసు ఆయన కెరీర్‌పై ప్రభావం చూపింది. 2023 అక్టోబర్‌లో బెంగళూరులో సేకరించిన నమూనాలో నిషేధిత స్టెరాయిడ్‌ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.

దీంతో ఆయనపై డోపింగ్‌ ఉల్లంఘన ఆరోపణలు వచ్చాయి. 2024లో తాత్కాలిక నిషేధం విధించారు. ఈ కారణంగా ఈ నెలలో జరిగిన ఐచి-నగోయా ఆసియా పారా గేమ్స్‌లో పాల్గొనలేకపోయారు. నమూనా కలుషితమై ఉండొచ్చని లేదా పరీక్షల్లో మార్పిడి జరిగి ఉండొచ్చని నీరజ్‌ వాదించారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు డీఎన్‌ఏ పరీక్ష కూడా కోరారు. ఆయన మృతికి డోపింగ్‌ నిషేధమే కారణమని నిర్ధారించే ఆధారాలు ఇంకా వెలుగులోకి రాలేదు.

Also Read : స్టాక్ మార్కెట్‌లో జియో ప్లాట్‌ఫార్మ్స్ బ్లాక్‌బస్టర్ ఎంట్రీ!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>