కలం, జడ్చర్ల: సర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ (Hari Priya) అధికారులను ఆదేశించారు. మహబూబ్నగర్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ), 75–జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్ఓ), గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో హరిప్రియ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్–2026) పురోగతిని సమీక్షించారు.
ఈ సమావేశంలో జడ్చర్ల మండల డిప్యూటీ తహశీల్దార్, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్, 75–జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుధవారం నాటికి ఎస్ఐఆర్–2026 లో భాగంగా నోటీసుల పంపిణీ, విచారణల నిర్వహణ పురోగతిని ఈఆర్ఓ సమీక్షించారు. ఇప్పటివరకు 99.74 శాతం నోటీసుల పంపిణీ, 98 శాతం విచారణలు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మిగిలిన కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశిత గడువులోగా విచారణలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అలాగే, ఏఈఆర్ఓల లాగిన్లలో పెండింగ్లో ఉన్న ఫారం–6, ఫారం–7, ఫారం–8 దరఖాస్తుల స్థితిగతులను సమీక్షించి, వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఆమోదించిన, తిరస్కరించిన దరఖాస్తుల జాబితాలను సిద్ధం చేసి, ప్రజల సమాచారార్థం నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని, వాటి ప్రతులను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేయాలని సూచించారు. ఎస్ఐఆర్–2026కు సంబంధించిన సమాచారాన్ని, కార్యకలాపాలను సక్రమంగా నమోదు చేసి, రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు.
సమావేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన అంశాలను పరిశీలించి, వారి సందేహాలను ఈఆర్ఓ నివృత్తి చేశారు. ఎస్ఐఆర్–2026లో భాగంగా నోటీసుల జారీ, విచారణల ప్రక్రియ నవంబర్ 5వ తేదీతో ముగియనున్నట్లు, తుది ఓటరు జాబితాను నవంబర్ 9వ తేదీన ప్రచురించనున్నట్లు తెలిపారు. అర్హులైన ఓటర్లు విచారణలకు హాజరయ్యేలా, ఓటరు నమోదు ప్రక్రియలో పాల్గొనేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఈఆర్ఓ కోరారు. సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి, ఎస్ఐఆర్–2026 ప్రక్రియను నిర్ణీత గడువులోగా పారదర్శకంగా, సజావుగా పూర్తి చేయాలని సూచించారు.

