కలం, జోగులాంబ గద్వాల: రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ ఉద్యోగులను (NHM Contract Employees) వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం గద్వాల పట్టణంలోని వైఎస్సార్ చౌక్‌లో ఉద్యోగులు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు పంపి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ”ప్రస్తుత కాంట్రాక్ట్ వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయి. దీనివల్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు తీవ్ర వివక్షకు గురవుతున్నారు. కరోనా వంటి విపత్కర కాలంలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి నిరంతరం ప్రజలకు సేవలందించిన ఉద్యోగులను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ‘సమాన పనికి సమాన వేతనం’ సూత్రాన్ని వర్తింపజేస్తూ, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలి. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిసి నిరవధిక దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జ్ఞాని, సౌజన్య, శరణ్య, ఏంజెల్, శివ, హనుమంతు, నరసింహులు తదితర NHM కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు.

