ప్రభుత్వ పాఠశాలలకు అండగా అమర రాజా, రాజన్న ఫౌండేషన్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రతిభకు పేదరికం అడ్డు కారాదని భావించి, నాణ్యమైన విద్యను అందించి, వారి జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావాలనే ఉన్నత లక్ష్యంతో చేపట్టిన ‘శతశాతం విద్యా కార్యక్రమం’కు వివిధ సంస్థలు ముందుకొచ్చి సహకారం అందించాయని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. ఈ విధంగా సహకారం అందించడం సంతోషకరమన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) ఫస్ట్ ఆధ్వర్యంలో, వందేమాతరం ఫౌండేషన్ అకాడమిక్ సహకారం అందిస్తున్న శతశాతం విద్యా వాలంటీర్లకు మూడవ నెల గౌరవ వేతనాన్ని ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ హితం కోసం స్వార్థరహితంగా, పక్కా ప్రణాళికతో మంచి కార్యక్రమాలను చేపడితే సమాజంలోని వ్యక్తులు, సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ వంతు సహకారం అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు శతశాతం విద్యా కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా విద్యా వాలంటీర్ల సేవలను వినియోగిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా 45 పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యా వాలంటీర్లకు గౌరవ వేతనాన్ని అందించేందుకు రాజన్న ఫౌండేషన్ , అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు.

వాలంటీర్లకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు సమాజంలోని మిత్రులు, పరిచయస్తులు, విద్యాభిమానులు, వివిధ సంస్థల ప్రతినిధులను భాగస్వాములుగా చేర్చుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ క్రమంలో అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రతినిధి నిరంజన్‌ను సంప్రదించి కార్యక్రమం లక్ష్యాలను వివరించగా, సంస్థ తరఫున సహకారం అందించేందుకు ఆయన ముందుకు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు.

మహబూబ్‌నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శతశాతం విద్యా వాలంటీర్లకు ప్రతి నెలా గౌరవ వేతనాన్ని అందించేందుకు రాజన్న ఫౌండేషన్, అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ముందుకు రావడం వల్ల శతశాతం కార్యక్రమ నిర్వహణలో తమపై ఉన్న ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని ఎమ్మెల్యే (Yennam Srinivas Reddy) తెలిపారు. ఈ సంస్థ ముందుకొచ్చి సహకరించడం ఇతర సంస్థలకు కూడా స్ఫూర్తినిస్తుందని, మరిన్ని సంస్థలు విద్యారంగ అభివృద్ధిలో భాగస్వాములయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం కేవలం ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాల్సిన సామాజిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంతో పాటు సమాజ అభివృద్ధికి బలమైన పునాదులు వేయవచ్చన్నారు.

శతశాతం విద్యా కార్యక్రమాన్ని మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లేందుకు ఇతర కంపెనీలు, సంస్థలను కూడా భాగస్వాములుగా చేర్చుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. విద్యారంగ అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాలకు సమాజం నుంచి సహకారం లభిస్తే మరింత సమర్థవంతంగా లక్ష్యాలను సాధించవచ్చన్నారు. మంచి లక్ష్యంతో, స్పష్టమైన ప్రణాళికతో, బాధ్యతాయుతమైన వ్యక్తుల భాగస్వామ్యంతో కార్యక్రమాలను నిర్వహిస్తే సమాజంలోని దాతలు, విద్యాభిమానులు, సంస్థలు తప్పకుండా ముందుకొస్తాయని ఆయన పేర్కొన్నారు.

శతశాతం విద్యా కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించి, వారి సామర్థ్యాలను వెలికితీసి, ఉన్నత లక్ష్యాలను సాధించేలా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించేందుకు ముందుకొచ్చిన అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని సంస్థలు కూడా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభ్యున్నతికి తమ వంతు సహకారం అందించాలని యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి, అమరరాజ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ రెడ్డి, సతీష్ హెడ్ ఆఫ్ రాజన్న ఫౌండేషన్, ఎఎంఓ దుంకుడు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ సిజే బెనహర్, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, వందేమాతరం ఫౌండేషన్ సమన్వయ కర్త రవీందర్ రెడ్డి, గుముడాల గోవర్థన్ గౌడ్, వాగ్దేవి జూనియర్ కళాశాల డైరెక్టర్ విజేత వెంకట్ రెడ్డి, ప్రతిభ జూనియర్ కళాశాల డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, రిషి జూనియర్ కళాశాల డైరెక్టర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Also Read : స్టాక్ మార్కెట్‌లో జియో ప్లాట్‌ఫార్మ్స్ బ్లాక్‌బస్టర్ ఎంట్రీ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>