హైదరాబాద్‌కు నీటి గండం.. జలమండలి షాకింగ్ నిర్ణయం!

కలం, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad Water Crisis) పరిధిలో తాగునీటి సరఫరా జలమండలికి సవాలుగా మారింది. గ్రేటర్ పరిధిలోని 16 మండలాల్లో కేవలం మూడింటిలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా, మిగిలిన మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. దీనికి తోడు గ్రౌండ్ వాటర్ లెవెల్ గణనీయంగా పడిపోవడం, నగరానికి తాగునీరు అందించే జంట జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో నల్లా కనెక్షన్ల ద్వారా నీటిని సప్లై చేయడం జలమండలికి తలకుమించిన భారంగా మారుతున్నది. ఒక రకంగా ‘వాటర్ ఎమర్జెన్సీ’ తరహా పరిస్థితి నెలకొన్నదని ముఖ్యమంత్రి ఇటీవల నిర్వహించి సమీక్ష సందర్భంగా జలమండలి వివరించినట్లు తెలిసింది.

అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇకపై మూడు రోజులకోసారి నల్లా నీళ్లు ఇవ్వాలని జలమండలి ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఇంతకాలం నగరానికి కొంత మేర తాగునీటిని అందించే సింగూరు, మంజీర రిజర్వాయర్లు డెడ్‌స్టోరేజీకి చేరుకోవడంతో అక్కడి నుంచి తీసుకోవడం అసాధ్యంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంపై జలమండలి దృష్టిపెట్టింది. గోదావరి నీటిని నగరానికి తరలించేలా ఆలోచిస్తున్నది. ఇందుకోసం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని వెలిమెల దగ్గర 1200 మి.మీ. వ్యాసంతో కూడిన భారీ పైప్‌లైన్ నిర్మాణం పనులు చేపట్టింది.

శివారు ప్రాంతాల్లో ఇప్పటికే అమలు

ప్రస్తుతం నగర ప్రజలకు నల్లా ద్వారా రోజు విడిచి రోజు తాగునీటిని సరఫరా చేస్తుండగా, ప్రస్తుతమున్న నీటి కొరత కారణంగా ప్రతి మూడు రోజులకు ఒకసారి సప్లై చేయాలని జలమండలి ఆలోచిస్తున్నది. ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్, సిటీ శివారు ప్రాంతాల్లో ఈ విధానం అమలవుతున్నది. జలమండలి పరిధిలోని అన్ని ప్రాంతాలకూ ఇదే విధానాన్ని అమలు చేయడం ద్వారా నీటి కొరత ఉన్న పరిస్థితుల్లో భారాన్ని తగ్గించుకోవచ్చని అధికారుల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

వేసవి తరహాలోనే ఇప్పుడు కూడా ప్రతీరోజు యావరేజ్‌గా ఏడున్నర వేలకు పైగా ట్యాంకర్ల బుకింగ్స్ ఉంటున్నాయని, ప్రైవేట్ ట్యాంకర్ల సంఖ్య దీనికి నాలుగైదు రెట్లు ఎక్కువే ఉండొచ్చని, వాటిపై నియంత్రణ లేని కారణంగా కచ్చితమైన లెక్కలు లేవని జలమండలి అధికారి ఒకరు వివరించారు. సిటీలోని పలు ప్రాంతాల్లో కొత్త బోర్లు వేయకుండా నిషేధం విధించడంతో పాటు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ మీద ఆడిట్ నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల చెరువుల్లో (గణనీయమైన స్థాయిలో నీటిని నిల్వ చేసే) కేవలం 500 చోట్లనే నీరు ఉన్నట్లు స్టేట్ ఇరిగేషన్ లేటెస్ట్ రిపోర్టు ద్వారా వెల్లడైంది.

ఆంక్షలున్నా ఆగని వేస్టేజ్

నీటిని పొదుపుగా వాడుకోవాలని ముఖ్యమంత్రి మొదలు జలమండలి అధికారుల వరకు ప్రజలకు పిలుపునిచ్చినా.. నగరంలో చాలాచోట్ల వాటర్ వేస్టేజీ కొనసాగుతూనే ఉన్నది. నీటిని వృథా చేసినందుకు జలమండలి జరిమానాలు విధిస్తున్నా, నల్లా కనెక్షన్ కట్ చేస్తున్నా, బోర్‌వెల్స్ మోటార్లను సీజ్ చేస్తున్నా, ట్యాంకర్ల ద్వారా సరఫరాను నిలిపివేస్తున్నా నీటి వృథా ఆగడం లేదు.

ఇదిలాఉంటే నగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లతో పాటు సింగూర్, మంజీర, నాగార్జునసాగర్ (వయా అక్కంపల్లి) ద్వారా తాగునీరు అందుతున్నది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్‌లో 2 టీంసీలు (ఉండాల్సింది 3.5 టీఎంసీలు), హిమాయత్ సాగర్‌లో 2 టీఎంసీలు (2.9 టీఎంసీలకు గాను), సింగూర్‌లో 3.4 టీఎంసీలు (29.9 టీఎంసీలకు గాను), నాగార్జునసాగర్‌లో 184 టీఎంసీలు (312 టీఎంసీలకు గాను) నీటి లభ్యత ఉన్నది. ఈ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో ప్రత్యామ్నాయంగా గోదావరి నుంచి సప్లై చేయడంపై జలమండలి ఫోకస్ పెట్టింది. ఇంకోవైపు పరిశ్రమలు, భవన నిర్మాణాలు, గార్డెనింగ్, సాధారణ అవసరాలకు నవంబరు 1 నుంచి గ్రీన్ ట్యాంకర్ల ద్వారా గ్రే వాటర్ (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లలో శుద్ధి చేసిన నీరు) సప్లై చేసేలా ప్లాన్ చేసింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>