కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా (Pawan Khera) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పును (Telangana High Court) రిజర్వు చేసింది. జస్టిస్ సుజన శుక్రవారం తీర్పును వెల్లడించే అవకాశమున్నది. అసోం ముఖ్యమంత్రి భార్య రినికి భుయాన్ శర్మను ఉద్దేశించి పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలపై ఆమె ఫిర్యాదు మేరకు ఆ రాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అరెస్టు చేస్తారనే ఉద్దేశంతో పవన్ ఖేరా తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుజన గురువారం ఉదయం విచారణ ప్రారంభించి మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఆయన తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సంఘ్వి వాదిస్తూ.. పవన్ ఖేరా నివాసం హైదరాబాద్‌లో ఉన్నందున తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందన్నారు. అసోం సీఎం భార్యకు మూడు దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని, విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని పవన్ ఖేరా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
రాజకీయ ప్రతీకారంతోనే ఎఫ్ఐఆర్ నమోదు
అసోం సీఎం భార్యపై పవన్ ఖేరా (Pawan Khera) ఆరోపణలు చేసిన అనంతరం ఆమె ఫిర్యాదు మేరకు గువాహటి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడాన్ని సింఘ్వి తప్పుపట్టారు. కేవలం రాజకీయ ప్రతీకారంతోనే అనేక సెక్షన్ల కింద కేసులు పెట్టారని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోడానికి బదులుగా అధికార దుర్వినియోగానికి అసోం సీఎం పాల్పడ్డారని ఆరోపించారు. ఫిర్యాదు చేసింది రినికి శర్మ అయినా డీఫాక్టో ఫిర్యాదుదారు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) అని వాదించారు. కేసులో సాక్ష్యాలు డిజిటల్ రూపంలో ఉన్నాయని, అరెస్టు చేయాల్సిన అవసరమే లేదన్నారు. ముందుగా నోటీసు ఇవ్వాలని, ఆ తర్వాత అరెస్టు చేయాల్సిన అవసరాన్ని పోలీసులు పేర్కొనాలని అన్నారు. ఆరోపణలు చేసిన పవన్ ఖేరా ఒక పొలిటీషియన్ అని, సమాజంలో దీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారని, దేశం విడిచి వెళ్ళే ఆలోచన లేదన్నారు.
తెలంగాణలో పిటిషన్ వెనక మతలబేంటి?
పవన్ ఖేరా వ్యాఖ్యలు చేసింది అసోం సీఎం భార్యపైన.. ఆరోపణలు చేసింది ఢిల్లీలో.. హైదరాబాద్ వచ్చి మరీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని అసోం అడ్వొకేట్ జనరల్ దేవజిత్ సైకియా తప్పుపట్టారు. పవన్ ఖేరా నివాసం ఉంటున్నది ఢిల్లీలో అయినప్పుడు ముందస్తు బెయిల్ కోరాల్సింది కూడా ఢిల్లీ హైకోర్టులోనే అని జస్టిస్ సుజన బెంచ్ ముందు వాదనలు వినిపించారు. ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ లేనప్పుడు ఎక్కడి నుంచైనా గువాహటి హైకోర్టులోనే పిటిషన్ దాఖలు చేయవచ్చని అన్నారు. ఢిల్లీలోని పవన్ ఖేరా నివాసానికి అసోం పోలీసులు వెళ్లారని, కానీ అప్పటికే ఆయన హైదరాబాద్ వెళ్లారని గుర్తుచేశారు. విమానంలో వెళ్ళినందున ఆయనను ఫ్లైట్ రిస్క్ కేటగిరీలో చేర్చాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఆగమేఘాల మీద హైదరాబాద్ వెళ్ళిన ఆయన భవిష్యత్తులో వేరే దేశాలకు వెళ్ళరన్న గ్యారంటీ ఏమున్నదని ప్రశ్నించారు.
పవన్ భార్య హైదరాబాద్‌లో ఉంటున్నారు
పవన్ ఖేరా భార్య హైదరాబాద్‌లో ఉంటారని, ఆమె సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి అని, అందువల్లనే ఆయన హైదరాబాద్ వెళ్ళారని ఆయన తరఫు న్యాయవాది వివరించారు. అసోం సీఎం భార్య రినికి శర్మపై పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలన్నీ రికార్డుల్లోని అంశాలేనని, ఆమె స్థిర, చరాస్తుల వివరాలను హిమంత బిశ్వశర్మ తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనలేదన్నారు. మూడు పాస్‌పోర్టులు ఉన్నాయనేది వాస్తవమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పవన్ ఖేరాపై ఫేక్, ఫోర్జరీ సెక్షన్ల కింద భారత న్యాయ సంహితలోని 175, 35, 36, 318, 338, 337, 340, 352, 356 సెక్షన్ల కింద అసోం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసులు నమోదు చేశారని, అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్నారని, అందువల్లనే బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నామన్నారు.
దీనికి కౌంటర్‌గా రినికి శర్మ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని.. పవన్ ఖేరా చేసిన ఆరోపణలు తీవ్రమైనవని, ఆయనపై రాజకీయ ప్రతీకార చర్యలు తీసుకోవాల్సిన అవసరం పోలీసులకు లేదని, ఫిర్యాదు చేసిన రినికి శర్మకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేనప్పుడు పోలీసులు రాజకీయ ఉద్దేశంతో ఎందకు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఒక మహిళ డిగ్నిటీ దెబ్బతినేలా పవన్ ఖేరా ఆరోపణలు చేశారని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేవని, పవన్ ఖేరా ప్రస్తావించినవన్నీ ఫేక్, ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లని అన్నారు. ఇరు తరఫున వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ సుజన తీర్పును వాయిదా వేశారు. తీర్పును శుక్రవారం వెల్లడించే అవకాశమున్నది.
Read Also: జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ
Follow Us On: Instagram

