హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత పోస్టులు.. నిందితుడు అరెస్ట్

కలం, క్రైమ్ బ్యూరో: తెలంగాణ హైకోర్టు మహిళా న్యాయమూర్తి మాధవి దేవీ (High Court Judge)పై అనుచిత పోస్టులు చేసిన నిందితుడు దామోదర్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బండి భగిరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‎లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే బండి భగిరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో హైకోర్టు మహిళా న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకొని కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ (Trolling) చేశారు. బండి భగిరథ్‎కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే న్యాయమూర్తి భర్తకు బార్ కౌన్సిల్ ఛైర్మన్ పదవి ఇస్తారంటూ ప్రచారం జరిగింది. మహిళా న్యాయమూర్తి ఈ పోస్టులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు పోస్టులు చేయడం తనను బాధించిందని వ్యాఖ్యనించారు. బాధితురాలి తరపు న్యాయవాదికి అభ్యంతరాలు ఉంటే ఈ కేసు విచారణ నుంచి వైదొలగుతానని చెప్పారు. ఇటువంటి ఊహాజనిత వ్యాఖ్యలు, అవాస్తవాలను ప్రచారం చేయడం వల్ల న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుందని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

న్యాయమూర్తి ఆదేశాల మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) బీ.చిరంజీవి మే 15న చార్మినార్ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ కేసును చార్మినార్ పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేశారు. ఆయా పోస్టులపై దృష్టిసారించిన పోలీసులు ఐపీ అడ్రస్ ప్రధానం కావడంతో వాటిని అందించాలని సర్వీస్ ప్రొవైడర్లకు మెయిల్స్ పంపించారు. సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దామోదర్‎ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరింతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>