కలం, వెబ్‌డెస్క్: ఓ విశ్రాంత ఉద్యోగికి మెడిక్లెయిమ్ రీయింబర్స్మెంట్ పూర్తిగా చెల్లించాల్సిదేనంటూ కేంద్రానికి తెలంగాణ హైకోర్టు (Telangana HC) ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ లాంటి అసాధారణ, అత్యవసర పరిస్థితిలో చికిత్స పొందిన విశ్రాంత ఉద్యోగికి, అతని భార్యకు సాంకేతిక కారణాలు సాకుగా చూపుతూ మెడిక్లెయిమ్ ఎగ్గొట్టడానికి ప్రయత్నించడాన్ని తప్పుపట్టింది. ఈ మేరకు కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం కొట్టివేసింది. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో వై.ఆదినారాయణ ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేసి రిటైరయ్యారు.కొవిడ్ సమయంలో ఆ మహమ్మారి బారిన పడిన ఆయన, ఆయన భార్య ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. బిల్లు మొత్తం రూ.21.39లక్షలు అయ్యింది. ఆ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్) కింద రీయింబర్స్ కోరుతూ ఆదినారాయణ దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కేంద్ర ప్రసార సమాచార శాఖ కేవలం రూ.3.47లక్షలు మాత్రమే రీయింబర్స్ చేసి, మిగిలినది చెల్లించలేదు. దీనిపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్‌ను) ఆదినారాయణ ఆశ్రయించారు. క్యాట్ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని ప్రసారభారతిని ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ కేంద్రం తెలంగాణ హైకోర్టు (Telangana HC) ను ఆశ్రయించింది. పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్రం తీరును తప్పుబట్టిన తెలంగాణ హైకోర్టు… సదరు విశ్రాంత ఉద్యోగికి పూర్తి మెడిక్లెయిమ్ చెల్లించాలని ఆదేశించింది.
Read Also: ‘ఉపాధి హామీ’ ఆత్మను చంపేసే కుట్ర
Follow Us On: Instagram


