బీజేపీ ఎంపీలు గొంతెత్తుతారా?

కలం తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతుండడంతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై బీజేపీ ఎంపీలు (BJP MPs) గొంతెత్తుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉన్నదని, గత పన్నెండేండ్లలో దాదాపు రూ.13 లక్షల కోట్ల సాయం చేసిందని రాష్ట్ర బీజేపీ ఎంపీలు తరచూ చెప్తున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి కీలకంగా మారిన మెట్రో రైల్ సెకండ్ ఫేజ్‌కు అవసరమైన కేంద్ర ప్రభుత్వ పర్మిషన్, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు, రేడియల్ రోడ్లకు ఆర్థిక సహకారం, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం.. ఇలాంటి మొత్తం 12 డిపార్టుమెంట్లకు చెందిన 47 అంశాలు కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్రం జాప్యం కారణంగా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికకు ఆటంకం కలుగుతున్నదని, వీటిని చేపట్టేందుకు ఆర్థికంగా అంచనా వ్యయం పెరుగుతున్నదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తున్నది.

సీఎం మీటింగ్‌కు ఈటల, కొండా హాజరు

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 13న ప్రజాభవన్‌లో జరిగిన ఎంపీల సమావేశానికి బీజేపీ తరఫున ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించి కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వెలువడేలా కృషి చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు బీజేపీ ఎంపీలు రాష్ట్ర అంశాలపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

పార్టీలకు అతీతంగా ప్రజల అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పని చేయాలన్న సీఎం విజ్ఞప్తికి వీరు సానుకూలంగా స్పందించినందున ఈ సమావేశాల్లో రాష్ట్రం తరఫున ఎలాంటి వాయిస్ వినిపిస్తారన్నది కీలకంగా మారింది. పార్లమెంట్ సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఈ ఇద్దరు బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సంకేతాలిచ్చారు. ఈ హామీ ఎంతవరకు నిలబెట్టుకుంటారనేది ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారింది.

కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన డిమాండ్లలో కొన్ని..

= మెట్రో రైల్ కారిడార్‌కు ఆనుకుని ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగు రోడ్డు వరకు రేడియల్ రోడ్లు, 10 గ్రీన్ ఫీల్డ్ రోడ్ల నిర్మాణం, ఇండస్ట్రియల్ క్లస్టర్లు, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్స్ నిర్మాణానికి అవసరమైన రూ.45 వేల కోట్ల ఆర్థిక సాయం.

= హైదరాబాద్ నగరానికి గోదావరి నుంచి 37.5 టీఎంసీల నీటిని తరలించే డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు సెకండ్, థర్డ్ ఫేజ్ పనులు, మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టుకు ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’లో భాగంగా మొత్తం వ్యయంలో 25% మేర కేంద్రం మంజూరు చేయడం.

= ‘విభజన చట్టంలోని హామీ ప్రకారం బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి వీలుగా రాంచీలోని మెకాన్ సంస్థ నుంచి వెంటనే ఫీజిబిలిటీ రిపోర్టు తెప్పించుకోవడం.

= ‘ప్రధానమంత్రి మిత్రా పార్క్’ స్కీమ్‌లో భాగంగా వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు కేంద్ర సాయం పెంచడం.

= సింగరేణికి కాంపెన్సేటరీ ఎఫోరెస్టేషన్‌ను అనుమతించేందుకు ‘కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ’ గుర్తింపును పునరుద్ధరించడం.

= విద్యుత్ రంగంలో ఆర్డీఎస్ఎస్ స్కీమ్‌లో తెలంగాణ చేరినందున అమలు చేయడానికి ఇచ్చే రూ.25,096 కోట్ల మేర ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం.

= మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్‌ను ‘గాంధీ సరోవర్’గా మార్చే ప్రతిపాదనకు రక్షణ శాఖ సుమారు 84 ఎకరాల భూమిని ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా అవగాహనా ఒప్పందం త్వరగా పూర్తయ్యేలా సహకారం ఇవ్వడం. మూసీ నదిలోకి వ్యర్థాలు చేరకుండా ‘నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్’ ప్రకారం కేంద్రం మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 60%మేర ఆర్థిక సాయాన్ని అందించడం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>