కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా సోమవారం చిన్నారులకు ఆల్బండజోల్ ట్యాబ్లెట్లు (Albendazole Tablets) పంపిణీ చేయడానికి ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసిందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narasimha) వెల్లడించారు. రాష్ట్రంలో చిన్న పిల్లల్లో నులిపురుగుల సమస్యను నివారించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ స్కూల్ లో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
విద్యాశాఖ, మహిళా-శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్ళ మధ్య వయస్సున్న 96,81,855 మంది చిన్నారులు, విద్యార్థులకు ట్యాబ్లెట్లు వేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లతోపాటు, జూనియర్ కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒకే రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జూలై 13న ఏ కారణంతోనైనా మాత్ర వేయించుకోలేకపోయిన పిల్లలకు జూలై 20న మాప్-అప్ కార్యక్రమం ద్వారా తప్పనిసరిగా మాత్ర వేయాలని ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
రాష్ట్రంలో 1 నుంచి 19 ఏళ్ళ వయసున్న పిల్లలందరికీ ఆల్బండజోల్ మాత్రలు (Albendazole Tablets) తప్పనిసరిగా వేయించాలని పిల్లల తల్లిదండ్రులను మంత్రి కోరారు. పిల్లల్లో నులిపురుగులు ఉండడం వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, బరువు తగ్గడం వంటి సమస్యలు వస్తాయని.. వాటిని అధిగమించేందుకు పిల్లలకు మాత్రలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. 1–2 సంవత్సరాలు పిల్లలకు సగం ట్యాబ్లెట్.. నీళ్లలో కలిపి ఇవ్వాలని.. 2–3 సంవత్సరాలు ఉన్న పిల్లలకు ఒక మాత్రను నీళ్లలో కలిపి ఇవ్వాలని సూచించారు. 3–19 సంవత్సరాలు ఉన్న పిల్లలకు ఒక మాత్రను బాగా నమిలి మింగాలని తెలిపారు.
Read Also: కొండా మురళి పెద్దపులి.. నవీన్ రాజ్ చిన్నపులి: కొండా సురేఖ
Follow Us On: Instagram

