కలం, వెబ్‌డెస్క్: విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 17.651 శాతం డీఏను (DA for Power Employees) ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆమోదం తెలిపారు. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల సూచి ఆధారంగా ప్రతి సంవత్సరం జనవరి, జులై నెలలో డియర్ నెస్ అలవెన్స్ (డీఏ)/డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్)ను సమీక్షిస్తూ విడుదల చేస్తారు. అందులో భాగంగా ఈ సంవత్సరం జనవరి 7 2025 నుంచి అమలయ్యేలా ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు డీఏ/డీఆర్‌ను 17.651 శాతంగా ఖరారు చేశారు. తాజా ఉత్తర్వులతో విద్యుత్ సంస్థల పరిధిలోనికి 71,387 వేల మంది ఉద్యోగులు, ఆర్టిజెన్లు, పెన్షనర్లు లబ్ది పొందనున్నారు.
పెంచిన డీఏ(DA for Power Employees) ప్రకారం టీజీ ట్రాన్స్‌కోలో 3,036 మంది ఉద్యోగులకు, 3,769 మంది ఆర్టిజన్లకు, 2,446 మంది పెన్షనర్లకు మొత్తంగా 9,251 మందికి లబ్ది చేకూరనుంది. జెన్ కో విషయానికి వస్తే 6,913 మంది ఉద్యోగులకు 3,583 మంది ఆర్టిజన్లకు, 3,579 మంది పెన్షనర్లకు లబ్ది జరగనుంది. ఎస్పీడీసీఎల్‌లో 11,957 మంది ఉద్యోగులకు 8,244 మంది ఆర్టిజన్లకు, 8,244 మంది పెన్షనర్లకు లబ్ది జరగనుంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో 9,728 మంది ఉద్యోగులకు 3,465 మంది ఆర్టిజన్లకు, 6,115 మంది పెన్షనర్లకు లబ్ది జరగనుంది. మొత్తంగా ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు కలిపి 71,387 మందికి లబ్ది చేకూరనుంది.
Read Also: రూ.365 కోట్లు స్కాలర్ షిప్ బకాయిలు విడుదల
Follow Us On: Pinterest


