కలం, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్ర గవర్నర్ సి.హెచ్. శివ ప్రతాప్ శుక్లా(Governor Shiv Pratap) మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 10.20 గంటలకు నిజామాబాద్ చేరుకోనున్నారు. రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం వద్ద జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు గవర్నర్‌కు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య కాన్వాయ్‌లో ఉదయం 11 గంటలకు భూమారెడ్డి కన్వెన్షన్ హాల్‌కు చేరుకోనున్న గవర్నర్, నషా ముక్త్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించే యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం మధ్యాహ్నం 12.15 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో నిర్వహించే ‘సునహరీ మిట్టీ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొని పసుపు రైతులతో సమావేశమవుతారు. తదుపరి డిచ్‌పల్లి మండలం బర్దిపూర్-ధర్మారం శివారులోని పీహెచ్‌ఆర్ కన్వెన్షన్‌లో అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీపీ
గవర్నర్ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. గవర్నర్ పర్యటించే ప్రతి ప్రాంతంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్, సీపీ సమావేశమై గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ప్రొటోకాల్‌ను పాటిస్తూ గవర్నర్ పర్యటనలో ఏ దశలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.
విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, మెడికల్ టీమ్, 108, 104 సేవలతో పాటు ప్రత్యేక వైద్యుల బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వేదిక, సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించాలని, తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య మాట్లాడుతూ గవర్నర్ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, అనుమతి ఉన్న వారిని మాత్రమే గవర్నర్ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు.సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్వో గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, ఆర్డీవో రాజేంద్రకుమార్, ట్రైనీ ఆర్డీవో సందీప్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

