కలం, వెబ్ డెస్క్: సింగరేణి (Singareni) కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 1,135 మంది కార్మికులను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత మూడేళ్లుగా ఎదురు చూస్తున్న కార్మికులకు పెద్ద ఊరట లభించినట్లయింది. రెగ్యులరైజేషన్ ప్రక్రియ సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి వస్తాయని సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి స్పష్టం చేశారు. ఇక నుంచి రెగ్యులరైజ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం అమల్లోకి తెస్తున్నట్లు తెలిపారు. అంతేగాకుండా అర్హత ఆధారంగా సంస్థలో నియామకాలు, పదోన్నతుల ద్వారా ఉన్నత స్థానాలు పొందే అవకావం ఉందని వివరించారు.
వీరికే రెగ్యులరైజ్ అమలు..
సింగరేణిలో పనిచేస్తున్న 1,135 మంది బదిలీ వర్కర్లతో పాటు జనరల్ అసిస్టెంట్ ట్రైనీలను జనరల్ అసిస్టెంట్లుగా రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. అయితే వీరు 2025 డిసెంబర్ 31 కంటే ముందు విధుల్లో చేరి ఉండాలి. అండర్ గ్రౌండ్ గనుల్లో పనిచేసే కార్మికులు కనీసం 190 పని దినాలు, ఓపెన్ కాస్ట్ గనులు, ఉపరితల గనుల్లో 240 పని దినాల్లో పనిచేసి ఉండాలి. ఈ నిబంధనలతో అర్హులైన కార్మికుల జాబితాలను నవంబర్ 23వ తేదీలోగా ప్రధాన కార్యాలయానికి పంపించాలని ఏరియా జనరల్ మేనేజర్లను ఆదేశించారు.

