కలం, సూర్యాపేట: తెలంగాణలో 2024లో ప్రారంభమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. 2034 వరకు నిరాటంకంగా కొనసాగుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ధీమా వ్యక్తం చేశారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ప్రజాదరణ పెరుగుతోందని తెలిపారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా సూర్యాపేటలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
మంత్రి ఉత్తమ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో అర్హులైన పేద కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పాలనలో ఒక చారిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, సాగునీటి రంగంలో ఎదురైన తీవ్ర సవాళ్లు, ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి నమోదైందని మంత్రి వెల్లడించారు.
సర్వోత్తమ్‌రెడ్డిని గెలిపించాలి..
వ్యవసాయ రంగానికి నీటి కొరత రాకుండా, రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీ సంస్థాగత బలాన్ని నిరూపించే ముఖ్యమైన అవకాశమని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు విభేదాలు పక్కనబెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు.
కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ పరిధిలోని పట్టభద్రులకు మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నల్లగొండ, భువనగిరి ఎంపీలు కె.రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతిరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Also Read : నేలకొండపల్లిలో ప్రాచీన మానవ నివాస ఆనవాళ్లు.. వెలుగులోకి ఆధారాలు
Follow Us On : WhatsApp

