పంచాయతీల ఆదాయ జమ విధానంలో కీలక మార్పు

కలం, నిర్మల్ : గ్రామ పంచాయతీల(Gram Panchayats) ఆర్థిక వ్యవహారాల్లో కీలక మార్పు చోటుచేసుకోనుంది. గ్రామ పంచాయతీలు వివిధ మార్గాల ద్వారా సమకూర్చుకునే సొంత ఆదాయాన్ని ఇకపై ట్రెజరీకి జమ చేయకుండా నేరుగా ఆయా గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసే విధంగా ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే ఇందుకు సంబంధించి చట్ట సవరణ జరగ్గా, తాజాగా ఉత్తర్వులు వెలువడటంతో అమలుకు మార్గం సుగమమైంది. ఈ నిర్ణయంతో గ్రామ పంచాయతీలకు తమ ఆదాయంపై మరింత నియంత్రణ లభించనుంది.

జిల్లా వ్యాప్తంగా 19 మండలాల పరిధిలో 400 గ్రామ పంచాయతీలు ఉండగా, ఈ నిర్ణయం ఆయా గ్రామాల ఆర్థిక నిర్వహణలో ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఇప్పటివరకు ఇంటి పన్నులు, వివిధ రకాల పన్నులు, గ్రామ పంచాయతీ ఆస్తుల లీజులు తదితర మార్గాల ద్వారా సమకూరిన ఆదాయం ట్రెజరీలో జమ కావాల్సి వచ్చేది. తిరిగి ఆ నిధులను వినియోగించుకోవడానికి అవసరమైన ప్రక్రియ పూర్తిచేయాల్సి రావడంతో కొన్ని సందర్భాల్లో అభివృద్ధి పనులకు జాప్యం జరిగేది. తాజా నిర్ణయంతో ఈ ఇబ్బందులకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.

గ్రామ అవసరాలకు గ్రామ ఆదాయమే..

గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, డ్రైనేజీల మరమ్మతులు, అంతర్గత రహదారుల నిర్వహణ వంటి అనేక పనులకు నిధులు అవసరమవుతాయి. స్థానికంగా సమకూరే ఆదాయాన్ని నేరుగా పంచాయతీ ఖాతాలోనే ఉంచుకునే అవకాశం కలగడంతో అత్యవసర పనులకు నిధులు వినియోగించుకోవడం సులభతరం కానుంది. చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం నిధుల విడుదలపై ఆధారపడే పరిస్థితి తగ్గనుంది. గ్రామ అవసరాలకు అనుగుణంగా నిధుల వినియోగంపై పంచాయతీలకు వెసులుబాటు కలగనుంది.

అభివృద్ధికి కొత్త ఊతం..

గ్రామాల అభివృద్ధికి స్థానిక వనరులే కీలకం. పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని తిరిగి ఆయా గ్రామాల అభివృద్ధికే వినియోగించుకునే అవకాశం కల్పించడం గ్రామ స్వపరిపాలనను బలోపేతం చేసే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని 400 గ్రామ పంచాయతీల్లో ఈ విధానం సమర్థంగా అమలైతే పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, మౌలిక సదుపాయాల కల్పనలో మార్పు కనిపించే అవకాశం ఉంది. నిధుల కోసం ఎదురుచూసే పరిస్థితి నుంచి సొంత ఆదాయంతో స్థానిక సమస్యలను పరిష్కరించుకునే దిశగా గ్రామ పంచాయతీలు అడుగులు వేయనున్నాయి.

ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం హర్షనీయం: గుర్రం రాము, సర్పంచ్, కడ్తాల్

గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని నేరుగా పంచాయతీ ఖాతాల్లోనే జమ చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయం. గతంలో పంచాయతీల ద్వారా వసూలైన పన్నులు, ఇతర ఆదాయాలు ట్రెజరీకి జమ చేయాల్సి రావడంతో అవసరమైన సమయంలో నిధుల వినియోగానికి ఇబ్బందులు ఎదురయ్యేవి. తాజా నిర్ణయంతో గ్రామ పంచాయతీలకు ఆర్థిక వెసులుబాటు కలగడమే కాకుండా, గ్రామ అవసరాలకు అనుగుణంగా సొంత నిధులను సకాలంలో వినియోగించుకునే అవకాశం ఉంటుంది. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీలు, అంతర్గత రహదారుల వంటి సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. గ్రామాల అభివృద్ధికి స్థానిక ఆదాయం ఎంతో కీలకం. ఈ నిధుల వినియోగంలో పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>