కలం, కరీంనగర్ బ్యూరో: హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలను రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పష్టం చేశారు. ఒకప్పుడు వరంగల్ ఆర్ఈసీ ఎలాంటి జాతీయ స్థాయి గుర్తింపు, పోటీ ఉండేదో భవిష్యత్తులో హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాల కూడా అదే స్థాయికి చేరాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని తెలిపారు.
శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘AUREVIA 2K26’ నూతన విద్యార్థుల పరిచయ వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రథమ సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రి తన చేతుల మీదుగా ల్యాప్‌టాప్‌లు అందించి అభినందించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం, స్థానిక నాయకత్వం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నాలుగు సంవత్సరాల కోర్సు పూర్తయ్యేలోగా విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్ వచ్చేలా ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కళాశాలలో ఎంటెక్ తో పాటు ఎలక్ట్రికల్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, బయోమెడికల్ వంటి ఆధునిక కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
కళాశాలలో బోధనా ప్రమాణాలు పెంచేందుకు 48 పోస్టులు మంజూరు చేశామని, అందులో 36 మంది పర్మినెంట్ అధ్యాపకుల నియామకాన్ని మరో ఆరు నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. శాశ్వత భవనాలు, హాస్టళ్లు, క్రీడా ప్రాంగణం పనులను వేగవంతం చేస్తున్నామని, విద్యార్థుల ప్రయాణ సౌకర్యార్థం త్వరలోనే రెండు కళాశాల బస్సులను కేటాయిస్తామని తెలిపారు. విద్యార్థుల మానసిక, శారీరక దృఢత్వం కోసం ప్రత్యేక యోగా శిక్షణ, జిమ్, క్రీడా పరికరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రస్తుతం 290 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారని, కళాశాలలో అడ్మిషన్లు పెరిగేలా కృషి చేసిన యూనివర్సిటీ అధికారులను ఈ సందర్భంగా అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక అవగాహన పెంపొందించుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, ఆర్డీవో రామ్మూర్తి, ఇతర ప్రజాప్రతినిధులు, యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

