కలం, కరీంనగర్ బ్యూరో: సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని కరీంనగర్ (Karimnagar) మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే లక్ష్యంగా… రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహిళా వారోత్సవాలు జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా సోమవారం కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలోని కళాభారతి వేదికగా మహిళా శిశు సంక్షేమ, మెప్మా నగరపాలక సంస్థ సంయుక్త “మహిళా ఉన్నతి.. తెలంగాణ ప్రగతి” కార్యక్రమం నిర్వహించారు. మేయర్‌తో పాటు, సుడా ఛైర్మన్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకుల నరసయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. న్యూట్రిషన్ మిషన్ థీమ్‌లో భాగంగా పోషకాహార నియమాలపై మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వం అందించిన చీరలను మహిళా సమాఖ్య సంఘాల సభ్యులకు పంపిణీ చేశారు.
నగరాన్ని శుభ్రంగా ఉంచుదామని మేయర్ పిలుపు..
కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ… మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. నగరపాలక సంస్థ సంస్థ ప్రత్యేక శ్రద్ద వహించి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. మహిళలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి…. ప్లాస్టిక్ రహిత కరీంనగర్‌గా మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుతారో.. నగరాన్ని కూడ అంతే శుభ్రంగా ఉంచేలా కృషి చేయాలన్నారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మహిళ సంఘాల భవనాలు లేని చోట త్వరలో నిర్మిస్తామన్నారు. మహిళల కోసం మోదీ ప్రభుత్వం.. మరోసారి మహిళా బిల్లు ప్రవేశ పెట్టి, సమన్యాయం కల్పించేందుకు ప్రయత్నం చేశారన్నారు.
మహిళలకు వడ్డీ లేని రుణాలు..
సుడా ఛైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు మహిళా సమాఖ్య సంఘాలకు వడ్డీ లేని బ్యాంకు రుణాలను మంజూరు చేస్తుందని తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైనదని, వారి ఆర్థిక, సామాజిక సాధికారత కోసమే ప్రభుత్వం ఈ 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను చేపట్టిందన్నారు. వారం రోజుల పాటు నగర పరిధిలో మహిళల కోసం నిర్వహించబోయే వివిధ రకాల చైతన్య, ప్రగతి కార్యక్రమాలని విజయవంతం చేయాలని కోరారు.
మహిళలను గౌరవించుకోవాలి..
డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ కార్యక్రమం చేపట్టినా.. మహిళల పాత్ర కీలకం అన్నారు. మహిళలను గౌరవిస్తేనే మన సమాజాన్ని మనం గౌరవించుకున్నట్లే అని తెలిపారు.ఆరోగ్యమైన సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలను మరింత విజయవంతం చేసేలా మహిళలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కోటీశ్వరులను చేయడమే లక్ష్యం..
కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ… కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే గొప్ప లక్ష్యంతో మహిళా సమాఖ్య సంఘాలు, మహిళలకు ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా చేయుతనిస్తుందని తెలిపారు. మహిళలకు అందిస్తున్న చీరలను డివిజన్ల వారీగా కార్పొరేటర్ల సమన్వయంలో వార్డు ఆఫీసర్లు, మెప్మా, అధికార సిబ్బందితో పంపిణీ చేయిస్తామని తెలిపారు. ప్లాస్టిక్ నివారణ పై మహిళలు ప్రత్యేక దృష్టి పెట్టాలని… ప్లాస్టిక్ ఫ్రీ నగరం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రూ.14 కోట్ల చెక్కు అందజేత..
అంతకుముందు మహిళా సమాఖ్య సంఘాలకు బ్యాంకు లింకేజీ రూ.14.20 కోట్లు, రూ.19.24 లక్షల రుణాల చెక్కులను అతిథులు అందించారు. వంటల పోటీల్లో పాల్గొన్న అంగన్వాడీ టీచర్లకు మెమోంటోలు అందజేశారు. బాల్య వివాహాల నిర్మూలణ, ఛైల్డ్ కేరింగ్‌కు 1098,181 టోల్ ఫ్రీ నెంబర్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మహిళా సమాఖ్య సంఘాలు ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్, హెల్త్ క్యాంపు సెంటర్లను పరిశీలించారు. 25 నుంచి 30 వరకు అయిదు రోజుల పాటు ఈ మహిళా వారోత్సవాల్లో పోషకాహార మిషన్ ద్వారా వంటకాల పోటీలు, ప్రదర్శన, జంక్ ఫుండ్, పోషకాహారంపై అవగాహన, గర్భిణులకు రక్తహీనత పరీక్షలు చేయడం, వార్డుల వారీగా మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన తదితర కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్, సివిల్ సప్లై మాజీ ఛైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్లు అంజన్ కుమార్, తాటి ప్రభావతి, గొట్టె ముక్కుల ఉమారాణి, సాధినేని లావణ్య, విప్పల సాయి జ్యోతి, బోట్ల శ్యామల, ఆకుల నందిని, ఆకుల నర్మద, గాజ రమ, పొన్నం లక్ష్మి, మల్లికార్జున్ రాజేందర్, వాసాల రమేష్, గుమ్మడి రాజు, చంద్ర, భాస్కర్ నాయక్, మల్లేషం, డిప్యూటీ కమిషనర్ వేణు మాధవ్, డీఎంవో సరస్వతి, సీడీపీవో సబిత, డీఎంసీ శ్రీవాణి, టీఎంసీ మానస, సీయోను తదితరులు పాల్గొన్నారు.

